ఆ దేశాలకు గట్టి షాక్‌ ఇచ్చిన పుతిన్‌.. చమురు ఎగుమతులు బంద్‌!

28 Dec, 2022 18:50 IST|Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో భీకర దాడులు చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రష్యాకు ప్రధాన వనరుగా ఉన్న చమురు ఉత్పత్తులపై ప్రైస్‌క్యాప్‌ విధించి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి. అయితే, తాజాగా ఆయా దేశాలకు గట్టి షాక్‌ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. పశ్చిమ దేశాల ప్రైస్‌ క్యాప్‌కు కౌంటర్‌ ఇవ్వాలని సుదీర్ఘ కాలంగా భావిస్తున్న పుతిన్‌ తాజాగా ఆ దిశగా అడుగు వేశారు. ప్రైస్‌ క్యాప్‌ విధించిన దేశాలకు చమురు, చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయకూడదనే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జులై వరకు అమలులో ఉండనుంది. 

ఐరోపా సమాఖ్యలోని ఏడు పెద్ద దేశాలు, ఆస్ట్రేలియాలు రష్యా సముద్రం నుంచి ఉత్పత్తి చేస్తున్న ఆయిల్‌పై ప్రైస్‌ క్యాప్‌ను బ్యారెల్‌కు 60 డాలర్లుగా నిర్ణయించాయి. దానిని డిసెంబర్‌ 5 నుంచి అమలులోకి తీసుకొచ్చాయి. ఈ నిర్ణయానికి తాజాగా కౌంటర్‌ ఇచ్చింది క్రెమ్లిన్‌. చమురు ఎగుమతులను నిలిపివేస్తూ తీసుకొచ్చిన ఆదేశాలు 2023 ఫిబ్రవరి 1 నుంచి జులై 1 2023 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ముడి చమురు ఎగుమతులపై నిషేదం ఫిబ్రవరి 1 నుంచే అమలులోకి వస్తుండగా.. చమురు ఉత్పత్తులపై బ్యాన్‌ ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని రష్యా ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు.. ఈ ఆదేశాల్లో ప్రత్యేక క్లాజ్‌ను ఏర్పాటు చేసింది రష్యా ప్రభుత్వం. ప్రత్యేకమైన సందర్భంలో ఈ బ్యాన్‌ను అధ్యక్షుడు పుతిన్‌ ఎత్తివేసే అవకాశం కల్పించింది.

ఇదీ చదవండి: అమెరికాలోని ఎంబసీ ఆస్తులను అమ్మకానికి పెట్టిన పాకిస్థాన్‌

మరిన్ని వార్తలు