ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం.. పాకిస్తాన్‌లో అత్యవసర ల్యాండింగ్‌

21 Mar, 2022 17:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానం అత్యవసరంగా పాకిస్తాన్‌లో ల్యాండ్‌ అయ్యింది. ఖతార్​ ఎయిర్​వేస్​ క్యూఆర్​-579 విమానంలో పొగలు రావడంతో కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి దోహాకు బయలుదేరిన ఖతార్‌ ఎయిర్‌వేస్‌ క్యూఆర్​-579 విమానం కార్గో విభాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో విమానాన్ని అత్యవసరంగా పాకిస్తానలోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, సోమవారం తెల్లవారుజామున 3.20కి ఢిల్లీ నుంచి బయలుదేరిన విమానం ఉదయం 5.30 గంటలకు కరాచీలో ల్యాండ్​ అయింది. అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే విమానంలో ప్రయాణిస్తున్న 283 మందిని మరో విమానంలో దోహాకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా.. విమానంలో పొగలు రావడంపై సదరు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ స్పందించింది. ఈ సమస్య తలెత్తడంపై దర్యాప్తు చేపట్టినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో మిగతా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు