మంచి కోసం పుట్టుకొచ్చిన ఓ శక్తి.. క్వాడ్‌: ప్రధాని మోదీ

24 May, 2022 08:27 IST|Sakshi

టోక్యో: క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. క్వాడ్‌ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు.

మంగళవారం టోక్యో వేదికగా క్వాడ్‌ నేతల సమావేశం జరిగింది. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..   క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని అన్నారు. క్వాడ్ తక్కువ వ్యవధిలో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుందని, ఇండో-పసిఫిక్‌లో శాంతిని నిర్ధారించిందని పేర్కొన్నారు. 

ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్‌ పంపిణీ, క్లైమేట్‌ యాక్షన్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ పేర్కొన్నారు.   అంతేకాదు.. ప్రమాణం చేసిన కొన్ని గంటలకే క్వాడ్‌ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. 

సదస్సుకు ముందు.. బైడెన్‌, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి చర్చించారు ప్రధాని మోదీ.  

మార్చి 2021లో వర్చువల్‌గా క్వాడ్‌ నేతల మధ్య భేటీ జరగ్గా.. సెప్టెంబర్‌ 2021 వాషింగ్టన్‌ డీసీలో ఇన్‌ పర్సన్‌, మార్చి 2022లో వర్చువల్‌ మీటింగ్‌ జరగ్గా..  ఇప్పుడు టోక్యో వేదికగా జరుగుతున్న సమావేశం నాలుగవది.

మరిన్ని వార్తలు