చైనాకు క్వాడ్‌ పరోక్ష హెచ్చరికలు

26 Sep, 2021 03:35 IST|Sakshi

ఇండో–ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ నెలకొనాలి

మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం

క్వాడ్‌ సదస్సు నిర్ణయాలు

వాషింగ్టన్‌: ఇండో–ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేస్తామని క్వాడ్‌ సదస్సు ప్రతిజ్ఞ చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ నిబంధనలు అమలు కావాలని పిలుపునిచ్చింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి క్వాడ్‌ సదస్సు శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగింది. తొలిసారిగా నాలుగు దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ సందస్సులో ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో తమ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదో అవకాశమని నేతలు చెప్పారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్, జపాన్‌ ప్రధాని యోషిహిడె సుగా సదస్సు అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో చైనా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో క్వాడ్‌ సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సంయుక్త ప్రకటనలో నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఏ దేశమైనా ప్రవర్తించాలని పేర్కొన్నారు. ‘ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛగా వాణిజ్యం జరగాలి. వివాదాలు శాంతియుతంగా పరిష్కారం కావాలి.

దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రాదేశిక సమగ్రత కాపాడేలా కలసికట్టుగా కృషి చేస్తాం’’అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. అక్టోబర్‌ నుంచి భారత్‌ వ్యాక్సిన్‌ ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని క్వాడ్‌ సదస్సు స్వాగతించింది. పేద దేశాలకు కూడా వ్యాక్సిన్‌ అందేలా కృషి చేయనున్నాయి. 2022 నాటికల్లా వంద కోట్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందజేయనున్నాయి.
ఇండో ఫసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పరం సహకరించుకోనున్నాయి.  వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఒక నిర్ణయానికొచ్చాయి.  

మరిన్ని వార్తలు