Nobel Prize 2022: క్వాంటం టెక్నాలజీ మేధావులకు ఫిజిక్స్‌లో సంయుక్తంగా ప్రైజ్‌

4 Oct, 2022 16:24 IST|Sakshi

స్టాక్‌హోమ్‌: భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్‌హోమ్‌లోని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ కమిటీ ఈ ప్రకటన చేసింది.  భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌. క్లౌజర్‌, ఆంటోన్‌ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్‌ దక్కింది. 

చిక్కుబడ్డ ఫోటాన్‌లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్‌ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది.

ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్‌ ఆస్పెక్ట్‌ కాగా..  జాన్‌ ఎఫ్‌. క్లౌజర్ అమెరికాకు చెందిన  భౌతిక శాస్త్రవేత్త. ఇక  ఆంటోన్‌ జెయిలింగర్‌ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. 

చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్‌ కమిటీ ప్రకటించింది. 

కిందటి ఏడాది కూడా ఫిజిక్స్‌లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే.

► 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్‌ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్‌ మయర్‌(1963), డొన్నా స్ట్రిక్‌ల్యాండ్‌(2018), ఆండ్రియా గెజ్‌(2020) ఈ లిస్ట్‌లో ఉన్నారు.

► ఇక ఫిజిక్స్‌లో చిన్నవయసులో నోబెల్‌ ఘనత అందుకుంది లారెన్స్‌ బ్రాగ్‌. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్‌ నోబెల్‌ అందుకున్నాడు.

మరిన్ని వార్తలు