ఎడింబర్గ్‌కు రాణి భౌతికకాయం.. నాన్నమ్మ మరణంతో రాకుమారుల మధ్య ఐక్యత!

12 Sep, 2022 07:32 IST|Sakshi

లండన్‌: రాణి ఎలిజబెత్‌–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్‌ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్‌ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్‌ ప్యాలెస్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు.

శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్‌ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్‌ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్‌కు తరలిస్తారు. వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. 

రాకుమారుల ‘ఐక్యత’ 
విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్‌ చార్లెస్‌–3 కుమారులు ప్రిన్స్‌ విలియం, ప్రిన్స్‌ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్‌ ప్యాలెస్‌ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు.

ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా?

మరిన్ని వార్తలు