బ్రిటన్‌ రాణికి కరోనా కష్టాలు!

26 Sep, 2020 01:57 IST|Sakshi

లండన్‌: కరోనా మహమ్మారి ప్రభావం  బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2పైనా పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ వల్ల సందర్శకుల రాక తగ్గిపోవడంతో ఎలిజబెత్‌ కుటుంబం 35 మిలియన్‌ పౌండ్ల(45 మిలియన్‌ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్లు రాజకుటుంబం మనీ మేనేజర్‌ మైఖేల్‌ స్టీవెన్స్‌ చెప్పారు. ఎలిజబెత్‌ కుటుంబ వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ప్రకటించారు. బ్రిటన్‌లో రాజ కుటుంబానికి ఎన్నో ప్యాలెస్‌లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. వీరి ద్వారా ఫీజుల రూపంలో అందే మొత్తం ఎలిజబెత్‌ ఖాతాలోకే చేరేది.

కరోనాతో ఈ ఆదాయానికి భారీగా గండి పడింది. మరోవైపు రాణి నివసించే ప్రఖ్యాత బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. చివరిసారిగా రెండో ప్రపంచ యుద్ధం కొన్నాళ్లకు ఈ ప్యాలెస్‌కు మరమ్మతులు చేశారు. ఇప్పుడు నిధులు లేవని మరమ్మతులు ఆపేస్తే ప్యాలెస్‌ శిథిలావస్థకు చేరుతుందని  ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలో నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని స్టీవెన్స్‌ చెప్పారు. ఉన్న నిధులనే సర్దుబాటు చేసుకుంటామన్నారు. ప్యాలెస్‌  సిబ్బందికి ఇప్పటికే íజీతాలు చెల్లించడం నిలిపి వేశారు.  గత ఆర్థిక సంవత్సరం బ్రిటన్‌ ప్రభుత్వం రాజ కుటుంబానికి 69.4 మిలియన్‌ పౌండ్లు అందజేసింది. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4 మిలియన్‌ పౌండ్లు అధికం కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు