ఆ అమ్మాయి చీట్‌ చేసింది.. బుద్ధి సరిచేసుకో!

16 Sep, 2020 16:55 IST|Sakshi

‘తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు’ అన్నట్లుగా ఉంటుంది కొంతమంది వైఖరి. వాస్తవాలను అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తూ.. తమ వాదనే సరైందనే భావనలో ఉంటారు. వాస్తవాలను అంగీకరించకుండా ఇష్టారీతిన ఇతరులపై విమర్శలకు దిగుతూ మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అమెరికాకు చెందిన ఓ 23 ఏళ్ల కుర్రాడు సోషల్‌ మీడియాలో లేవనెత్తిన చర్చే ఇప్పుడు ఈ ప్రస్తావనకు కారణం. ఓ భారతీయ విద్యార్థిని ఆంగ్ల పరిజ్ఞానాన్ని చూసి ఓర్చుకోలేక.. ‘‘నేనేమైనా మూర్ఖుడినా’’అంటూ అతడు ప్రశ్నించిన తీరు నెటిజన్లకు చిరాకు తెప్పిస్తోంది. అందుకే.. ‘‘నువ్వు నిజంగా స్టుపిడ్‌వే’’ అంటూ చురకలు అంటిస్తూ ఇప్పటికైనా జాత్యహంకారం వీడమని సలహా ఇస్తున్నారు. నీ ప్రేయసి తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ చివాట్లు పెడుతున్నారు. ఆ రెడిట్‌ యూజర్‌ పోస్టుకు సంబంధించిన వివరాలు..

ఏంటి ఇండియా వాళ్లకు ఇంగ్లీష్‌ వచ్చా?!
నా గర్ల్‌ఫ్రెండ్‌కు 18 ఏళ్ల ప్రియా అనే ఇండియన్‌ ఫ్రెండ్‌ ఉంది. ఉన్నత చదువుల కోసం.. ఏడాది క్రితం... ఇంగ్లీష్‌ మాట్లాడే నా దేశానికి వచ్చిందామె. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. నేనేమో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ స్టూడెంట్‌ను. తను ఇంకా సైన్స్‌ చదువుతోంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజుల క్రితం నా గర్ల్‌ఫ్రెండ్‌ను, నన్ను ప్రియా వాళ్లింటికి ఆహ్వానించింది. మాకు భారతీయ వంటకాలు పెట్టింది. వైన్‌ ఇచ్చింది. నేనైతే బాగా తిన్నాను. చాలా బాగా గడిచింది రోజంతా. అయితే నా గర్ల్‌ఫ్రెండ్‌, ప్రియాకు ఓ స్క్రాబల్‌(గేమ్‌ బోర్టు- అక్షరాలతో అర్థవంతమైన పదాలు పేరుస్తూ ఆట ఆడుతారు) బహుమతిగా ఇచ్చింది. తనకు ఈ ఆట చాలా ఇష్టమని చెప్పింది. (చదవండి: ఫేస్‌బుక్‌కు దూరంగా ప్రముఖులు?)

కాబట్టి మేం గేమ్‌ ఆడాలని నిర్ణయించుకున్నాం. నేనైతే ముందే డిసైడ్‌ అయ్యా. వాళ్లిద్దరిని ఈజీగా ఓడించేయవచ్చని. కానీ అనూహ్యంగా ప్రియా లీడ్‌లోకి వచ్చేసింది. చాలా కఠినమైన పదాలను తను బోర్డులో చేర్చింది. నాకైతే తను పక్కాగా చీటింగ్‌ చేసింది అనిపించింది. ఎందుకంటే గేమ్‌ మధ్యలో తను బాత్‌రూంకి వెళ్లింది. 3 నిమిషాలు అక్కడే ఉంది. అప్పుడే గూగుల్‌ చేసి ఈ పదాలను పెట్టిందని అనుమానం. ఎందుకంటే ఇండియా నుంచి వచ్చిన ఆమెకు ఇంతటి ఇంగ్లీష్‌ భాషా పరిజ్ఞానం ఎలా ఉంటుంది. నేనిలా అన్నా... తనేం మాట్లాడలేదు. కనీసం సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. నవ్వుతూనే ఉంది. నేనేం చీటింగ్‌ చేయలేదు అని మాత్రం చెప్పింది. 

అయితే ఈ విషయంలో నా గర్ల్‌ఫ్రెండ్‌ చాలా అప్‌సెట్‌ అయ్యింది. నేను ఓడిపోయానని, తనకిది అవమానకరమని అన్నది. అయితే నేను నిజాయితీగా ఆడానని, చీటింగ్‌ చేసి ప్రియా నా మీద గెలిచిందని చెప్పాను. దాంతో  నా గర్ల్‌ఫ్రెండ్‌కు కోపం వచ్చింది. నన్ను రేసిస్ట్‌ అంటూ తిట్టింది. అంతేకాదు నాతో బంధం గురించి మరోసారి ఆలోచిస్తానని చెప్పింది. నేను అన్నదాంట్లో తప్పేముంది’’అంటూ అతడు ప్రశ్నించాడు. ఇందుకు స్పందనగా, ప్రియాకు మద్దతుగా చాలా మంది నెటిజన్లు అతడిపై విమర్శలు గుప్పించారు. ఐఈఎల్‌టీఎస్‌తో పలు కఠినమైన పరీక్షలు రాసి ఇండియన్‌ విద్యార్థులు యూఎస్‌కు వస్తారని, అంతేగాక ఎంతో మంది ఇండో అమెరికన్‌ చిన్నారులు స్పెల్‌ బీ పోటీలో ప్రతిభ చాటుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. నిజంగానే నువ్వు తెలివితక్కువ వాడివి అంటూ ఏకాభిప్రాయానికి వచ్చేశారు. ఇకనైనా బుద్ది మార్చుకో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు