వేలడంత లేని క్యాప్సూల్‌ మిస్సింగ్‌.. పశ్చిమ ఆస్ట్రేలియాలో హైఅలర్ట్‌ జారీ.. ప్రజల్లో వణుకు

28 Jan, 2023 16:25 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు వణికిపోతున్నారు. వేలు సైజులో కూడా లేని ఓ క్యాప్సూల్‌ కోసమే ఇదంతా. కనిపిస్తే విపత్తుల నిర్వహణ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఎమర్జెన్సీ నెంబర్లను ప్రకటించారు. ఎందుకంటే ఆ క్యాప్సూల్‌ మామూలుది కాదు.. రేడియోయాక్టివ్‌తో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం.

ఎనిమిది మిల్లీమీటర్ల పొడవు, ఆరు మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ఓ చిన్న రేడియోయాక్టివ్‌ క్యాప్సూల్‌ అది.  కిబంర్లీ రీజియన్‌లోని న్యూమన్‌ నుంచి పెర్త్‌కు(12 వేల కిలోమీటర్ల దూరం)  తీసుకెళ్తున్న సమయంలో.. రోడ్ల కుదుపులతో ట్రక్కు బోల్ట్‌ తెరుచుకుని అది కింద పడిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దాని కోసం వెతుకలాట నడుస్తోంది అక్కడ. ఆ సిల్వర్‌ క్యాప్సూల్‌లో సీసియం-137 ఉందని, అది చాలా ప్రమాదకరమని అత్యవసర సిబ్బంది ప్రకటించారు.

జనవరి 12వ తేదీనే ఆ ట్రక్కు గమ్యస్థానానికి చేరుకుందని, కానీ.. కనిపించకుండా పోయిన ఆ క్యాప్సూల్‌ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదని అత్యవసర సిబ్బంది వెల్లడించారు. ఈ పదార్థాన్ని మైనింగ్ కార్యకలాపాలలో ఉపయోగిస్తారని, దీని రేడియేషన్‌ వల్ల శరీరం కాలిపోవడం లేదంటే రేడియేషన్ అనారోగ్యానికి గురికావొచ్చని హెచ్చరించారు అధికారులు. ఇది ఎంత మేర డ్యామేజ్‌ చేస్తుందనే దానిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇది అత్యంత ప్రమాదరకమైన వ్యవహారమని చెప్తున్నారు. ప్రస్తుతం పిల్బరా, మిడ్‌వెస్ట్‌ గ్యాస్‌కోయిన్‌, మిడ్‌ల్యాండ్‌ గోల్డ్‌ఫీల్డ్‌లతో పాటు పెర్త్‌ మెట్రోపాలిటన్‌ రీజియన్‌లలో హైఅలర్ట్‌ ప్రకటించారు అధికారులు. 

మరిన్ని వార్తలు