దురాక్రమణ దుస్సాహసం

5 Sep, 2020 03:16 IST|Sakshi
ఎస్‌సీవో భేటీలో పాల్గొన్న చైనా, రష్యా రక్షణ మంత్రులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ (ఎడమ నుంచి కుడికి)

రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠం అదే

పరస్పర విశ్వాసంతోనే శాంతి

ఎస్‌సీఓ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టీకరణ

మాస్కో: పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

చైనా రక్షణ మంత్రి జనరల్‌ వీ ఫెన్‌ఘీ సమక్షంలోనే రాజ్‌నాథ్‌ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తూర్పు లద్దాఖ్‌లోని భారత్‌ సరిహద్దుల్లో తరచుగా దురాక్రమణ దుస్సాహసానికి పాల్పడుతున్న చైనాకు పరోక్ష సందేశంగా దీనిని భావిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్‌సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దురాక్రమణ విధాన దుష్ఫలితాలను ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ ఎస్‌సీఓ సభ్య దేశాలకు గుర్తు చేశారు.

ఎస్‌సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40% ఉంటుంది. సుమారు గత నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో దురాక్రమణలకు ప్రయత్నిస్తూ చైనా భారత్‌ను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా విఫల యత్నం చేసింది. ‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఈ సంవత్సరంతో 75 ఏళ్లు అవుతుంది.

శాంతియుత ప్రపంచం లక్ష్యంగా ఐరాస ఏర్పడింది. ఏకపక్ష దురాక్రమణలకు వ్యతిరేకంగా, దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని స్పష్టం చేస్తూ ఐరాస రూపుదిద్దుకుంది’అని రాజ్‌నాథ్‌ ఎస్‌సీఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సహాయక చర్యలను భారత్‌ విస్పష్టంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్‌ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎస్‌సీఓ ‘రీజనల్‌ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్‌ (ర్యాట్స్‌)’చేపట్టిన చర్యలను భారత్‌ ప్రశంసిస్తోందన్నారు. అతివాద, ఉగ్రవాద ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా ఎస్‌సీఓ తీసుకున్న నిర్ణయాలను భారత్‌ స్వాగతిస్తోందన్నారు.

అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు భారత్‌ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలున్నాయన్నారు. శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘పీస్‌ మిషన్‌’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ విభేదాలను విస్మరించి ఒక్కటి కావాలని రాజ్‌నాథ్‌ పిలుపునిచ్చారు.  

అఫ్గానిస్తాన్‌ పరిస్థితిపై ఆందోళన
అఫ్గానిస్తాన్‌లో అంతర్గత భద్రత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ‘అఫ్గాన్‌ నియంత్రణలో, అఫ్గాన్‌ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్‌ సహకారం అందించడం కొనసాగిస్తుంది. అఫ్గానిస్తాన్‌ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషికి మద్దతునిస్తుంది’అని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరిలో అఫ్గాన్‌ తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనంతరం అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను భారత్‌ నిశితంగా పరిశీలిస్తోంది.

భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందడుగు
మాస్కో: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో మాస్కోలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. మాస్కోలోని ప్రముఖ హోటల్‌లో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ సమావేశమయ్యారు. చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్, రష్యాలో భారత రాయబారి వెంకటేశ్‌ వర్మ కూడా ఉన్నారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఈ సంవత్సరం మేలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యితో ఫోన్‌లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్, వీ ఫెన్‌ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే. చైనా అభ్యర్థన మేరకే రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలు
వెల్లడించాయి.
 

మరిన్ని వార్తలు