Russian Troops: రష్యా ఆర్మీ కీచక పర్వం.. మానం కాపాడుకునేందుకు అందవిహీనంగా!

9 Apr, 2022 09:58 IST|Sakshi

ఉక్రెయిన్‌ మీద మిలిటరీ చర్య వంకతో.. రష్యా బలగాలు చెప్పడానికి వీల్లేని రీతిలో అకృత్యాలకు పాల్పడుతున్నాయి. కొన్ని ప్రాంతా నుంచి సైన్యం ఉపసంహరణ తర్వాత.. వీధుల్లోని దృశ్యాలు అక్కడ జరిగిన దమనకాండ ఏంటో ప్రపంచానికి తెలియజెప్తున్నాయి.

చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, కాళ్లు చేతులు కట్టేసి బుల్లెట్లు దింపిన శవాలు, సామూహిక అంత్యక్రియలు.. రష్యా బలగాలు చేపట్టిన మారణహోమానికి ప్రతీకలుగా నిలిచాయి. దీనిపై ప్రపంచం మొత్తం రష్యాను నిందిస్తోంది. అదే సమయంలో రష్యా బలగాల కీచక పర్వం ఏస్థాయిలో ఉందో ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.  

టీనేజ్‌ యువతుల దగ్గరి నుంచి పండు ముసలి దాకా.. ఎవరినీ వదలకుండా అఘాయిత్యాలకు తెగపడింది రష్యా సైన్యం. భయానకమైన ఆ అనుభవాల కథనాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఖేర్‌సన్‌ రీజియన్‌లో పదహారేళ్ల యువతితో పాటు ఓ వృద్ధురాలిపై రష్యా సైన్యం అత్యాచారానికి పాల్పడింది. చిన్నారులు, వయసు మళ్లిన వాళ్లే కాదు.. ఆఖరికి గర్భవతులైనా దాష్టీకానికి పాల్పడినట్లు కీవ్‌ వర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి.

గురువారం ఓ బోటులో పారిపోతున్న 14 మంది ప్రయాణికులను రష్యా బలగాలు అడ్డుకున్నాయని, అందులో 13 ఏళ్ల చిన్నారితో పాటు ఓ గర్భవతిపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు క్రైవ్యీ రిహ్‌ మిలిటరీ హెడ్‌ ఒలెక్సాండ్ర్‌ విల్కుల్‌  ప్రకటించారు. ఇంతకన్నా భయంకరమైన అనుభవాలు ఉక్రెయిన్‌ పౌరులు ఇప్పుడు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. 

మరో మార్గం లేక.. 
ఉక్రెయిన్‌లో ఆడవాళ్లది ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి. ప్రాణంతో పాటు మానం కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రష్యా సైన్యం ఏ క్షణాన మళ్లీ విరుచుకుపడుతుందో అని భయంగా గడుపుతున్నారు. కొందరు దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు.. జుట్టు కత్తిరించుకోవడం, నిండైన దుస్తులు ధరించడం.. రష్యా సైన్యానికి అందవిహీనంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజధాని కీవ్‌కు 50 మైళ్ల దూరంలోని ఇవాన్‌కివ్‌లో కనిపించే దృశ్యాలే అందుకు ఉదాహరణ. రష్యా బలగాల చెర నుంచి మార్చి 30న ఈ పట్టణానికి స్వేచ్ఛ దొరికింది. అప్పటిదాకా ఇక్కడ కీచక పర్వం కొసాగిందని డిప్యూటీ మేయర్‌ మర్యాన బెస్చాస్తానా వెల్లడించారు. బేస్‌మెంట్‌లో దాక్కున్న వాళ్లను జుట్టు పట్టుకుని బయటకులాగి మరీ అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆమె వెల్లడించారు. 

తన భర్తను చంపి.. నాలుగేళ్ల కొడుకు ముందే తనపై రష్యా సైనికులు అఘాయ్యితానికి పాల్పడ్డారంటూ ఓ తల్లి వ్యక్తం చేసిన ఆవేదనతో మొదలైన ఈ కీచక పర్వం గాథలు.. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

ఇక బుచాలో జరిగిన మారణహోమం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఘాయిత్యాలకు పాల్పడిన తర్వాత.. బాధితులను మంటల్లో కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందాయి రష్యా బలగాలు!. ప్రముఖ మేకప్‌ ఆర్టిస్ట్‌ అనస్థాషియా సుబచెవ(52) మృతదేహాన్ని.. ఆమె నెయిల్‌ పాలిష్‌ ఆధారంగా గుర్తించింది ఉక్రెయిన్‌ సైన్యం. అయితే ఆమె అత్యాచారానికి గురైందా లేదా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు