ఉన్నది రెండు అంగుళాలే, శాస్త్రవేత్తలను పరుగులు పెట్టిస్తోంది

12 Jul, 2021 02:18 IST|Sakshi

జీవం పుట్టుకను  తేల్చే ఉల్క

ఈ చిత్రంలో ఏదో ఓ బొగ్గు ముక్కలా కనిపిస్తున్నది చిన్నపాటి ఉల్క. ఉన్నది కేవలం రెండు అంగుళాలే.. కానీ శాస్త్రవేత్తలను పరుగులు పెట్టిస్తోంది. ఎందుకో తెలుసా..? భూమ్మీద జీవం పుట్టుకను తేల్చేందుకు ఈ ఉల్క తోడ్పడనుంది మరి. సైన్స్‌ పరంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ ఉల్కను గుర్తించడం వెనుక పెద్ద కథే ఉంది. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? 
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

వెంటాడి.. వేటాడి..
బ్రిటన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న రాత్రి ఆకాశాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ధగధగా మెరుస్తూ భూమివైపు దూసుకొస్తున్న ఓ ఉల్క కనబడింది. సాధారణంగా చిన్న చిన్న ఉల్కలు వాతావరణంలోనే మండిపోతాయి. కాస్త పెద్దవి అయితేనే దాటుకుని వచ్చి నేలపై పడతాయి. ఈ ఉల్క కూడా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ రావడంతో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అలా ఈ ఉల్క వించ్‌కోంబ్‌ ప్రాంతం దాకా వచ్చినట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, ఇళ్లలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి.. ఉల్క ఎక్కడ పడిందీ సుమారుగా గుర్తించారు. తర్వాత ఏడెనిమిది మంది శాస్త్రవేత్తలు, మరికొందరి సహాయంతో గాలించి.. ఓ ఇంటి ఆవరణలో ఒక ముక్కను, రెండు కిలోమీటర్ల దూరంలోని గొర్రెల ఫారంలో మరో ముక్కను గుర్తించారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.

జీవానికి ఆధారమైన అమైనో ఆమ్లాలతో..
బొగ్గు తరహాలో నల్లగా ఉన్న ఆ ఉల్కలను తీసుకెళ్లి పరిశోధన చేపట్టారు. అది చాలా ప్రత్యేకమైనదని గుర్తించి.. తాజాగా వివరాలను వెల్లడించారు. ఇది అత్యంత అరుదైన ‘కార్బొనసియస్‌ కాండ్రైట్‌’రకానికి చెందిన ఉల్క అని, సుమారు 460 కోట్ల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తలు తెలిపారు. 300 గ్రాముల బరువున్న ఈ ఉల్కలో.. జీవం పుట్టుకకు ఆధారమైన అమైనో ఆమ్లాలు, నీటి ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించారు. ‘‘సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు ఏర్పడిన తొలినాళ్ల నాటి గ్రహ శకలం ఇది.

దీనిని ఆనాటి పరిస్థితులను యథాతథంగా కాపాడుతున్న ‘టైం క్యాప్సూల్‌’అనుకోవచ్చు.భూమి, ఇతర గ్రహాల పుట్టుకకు సంబంధించిన విశేషాలను దీనిద్వారా తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ధ్వని వేగానికి 40 రెట్ల వేగం.. అంటే గంటకు 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించి.. మండిపోయింది..’’అని ఇంగ్లండ్‌ నేషనల్‌ హిస్టరీ మ్యూజియం పరిశోధకుడు డాక్టర్‌ ఆష్లే కింగ్‌ వెల్లడించారు. ఇప్పుడున్న జీవజాలం భూమ్మీద పుట్టిందేనా? అంతరిక్షంలో మరోచోటి నుంచి ఇక్కడికి వచ్చిందా? విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా అన్నదానికీ ఈ ఉల్క సమాధానం చెప్పగలదని తెలిపారు.   

మరిన్ని వార్తలు