While Elephant Viral Video: ఇంద్రుడి ఐరావతం భూమిపై పుట్టింది! ఏడు రకాల ప్రత్యేకతలు కూడా.. 

6 Aug, 2022 06:56 IST|Sakshi

పురాణాల ప్రకారం ఇంద్రుడి వాహనం ఐరావతం. అంటే తెల్లని మదపుటేనుగు.. సాధారణంగా ఏనుగులు తెలుపు రంగులో ఉండటం అత్యంత అరుదు. అలాంటిది ఇటీవల మయన్మార్‌లోని పశ్చిమ రఖినే రాష్ట్రంలో ఉన్న టౌంగప్‌ పట్టణంలో ఓ తెల్ల ఏనుగు పుట్టింది. ఆ తెల్ల ఏనుగు పిల్ల రెండున్నర అడుగుల ఎత్తుతో 80 కిలోల బరువు ఉంది. దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వ టీవీ చానల్‌ ప్రత్యేక వీడియో, ఫొటోలను విడుదల చేసింది.

ఓ నదిలో తల్లి ఏనుగుతో కలిసి తెల్ల పిల్ల ఏనుగు స్నానం చేస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మయన్మార్‌లో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని పాటిస్తారు. వారి సంస్కృతిలో తెల్ల ఏనుగులను పవిత్రమైనవిగా భావిస్తారు. ఇటు హిందూ పురాణాల ప్రకారం చూసినా.. తెల్ల ఏనుగు అయిన ఐరావతం ఇంద్రుడి వాహనంగా పూజలు అందుకుంటుంది. 

ఏడు రకాల ప్రత్యేకతలు కూడా.. 
పవిత్రంగా భావించే తెల్ల ఏనుగులకు సంబంధించిన ఏడు అంశాలు ఈ పిల్ల ఏనుగులో ఉన్నట్టు మయన్మార్‌ అధికార వార్తా సంస్థ గ్లోబల్‌ న్యూలైట్‌ తెలిపింది. ‘‘ముత్యం రంగులో ఉండే కళ్లు, తెల్లని వెంట్రుకలు, అరటి కాండం ఆకారంలోని వెనుకభాగం, సరైన ఆకృతిలోని తోక, చర్మంపై ఆధ్యాత్మికపరమైన గుర్తులు, పెద్ద చెవులు, ముందు కాళ్లకు ఐదు చొప్పున, వెనుక కాళ్లకు నాలుగు చొప్పున గోర్లు ఉన్నాయి. ఇవన్నీ పవిత్ర ఏనుగు లక్షణాలు’’ అని పేర్కొంది. మయన్మార్‌లో ప్రస్తుతం ఆరు తెల్ల ఏనుగులు ఉన్నట్టు వెల్లడించింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసి­నా తెల్ల ఏనుగుల సంఖ్య 30 మాత్రమే కావడం గమనార్హం. వీటిలోనూ ఎక్కువ భాగం మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాల్లోనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు