China Sheep Walking Video: చైనాలో గొర్రెల వింత ప్రవర్తన.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ!

22 Nov, 2022 18:09 IST|Sakshi

వైరల్‌: ఆ వీడియో.. చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంటర్నెట్‌ ద్వారా యావత్‌ ప్రపంచం చర్చించుకునేలా చేసింది. గొర్రెలు గుండ్రంగా పదిరోజులకు పైగా తిరిగిన వీడియో ఒకటి ఈ నెల మొదట్లో ట్విటర్‌ ద్వారా ఈ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. చైనా అధికారిక మీడియా సంస్థ పీపుల్స్‌ డెయిలీనే హైలెట్‌ చేసింది. అయితే.. 

ఈ వీడియోపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడిచింది. మరోవైపు చైనా నుంచి మరో ముప్పు రాబోతోందంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా నడిచింది. చైనీయులకు మాత్రం ఆ వీడియో వణుకు పుట్టించింది. గొర్రెల మంద అలా తిరగడం అపశకునంగా భావించారు చైనా ప్రజలు. ఏదైనా ప్రకృతి విపత్తుకు ముందస్తు సంకేతంగా అనుమానించారు. మరోవైపు.. లిస్టెరియోసిస్ బ్యాక్టిరియల్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా సర్కిలింగ్‌ డీసీజ్‌ కారణంగానే అవి అలా చేసి ఉంటాయని సైంటిస్టులు భావించారు. కానీ.. 

ఇవేవీ ఆ మూగజీవాల వింత ప్రవర్తను కారణం కాదని అంటున్నారు ఇంగ్లండ్‌ హార్ట్‌ప్యూరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ మ్యాట్‌ బెల్‌. మంగోలియాలోని ఓ పొలంలో గొర్రెలు అలా వ్యవహరించడం వెనుక బలమైన కారణం ఉందని ఆయన అంటున్నారు. చాలాకాలం పాటు గొర్రెలు దొడ్డిలోనే ఉండడం మూలంగానే అలా ప్రవర్తించి ఉంటాయని అంటున్నారు. ‘‘చాలాకాలంగా అవి దొడ్డికే పరిమితం అయ్యి ఉండొచ్చు. ఆ కారణంగానే బయటకు రాగానే.. అవి తమ పరిధిని దాటి పోకుండా అలాగే ఉండిపోయాయి. గుండ్రంగా తిరిగిన వాటి మూస ప్రవర్తనకు కారణం కూడా అదే. వాటిలో మందలోని కొన్ని గొర్రెలు అలా ప్రవర్తిస్తే.. పోనుపోనూ మిగతావి కూడా అనుసరిస్తూ ఉండిపోయాయి. ఇదసలు ఏమాత్రం మంచి పరిణామం కాదు’’ అని మ్యాట్‌ బెల్‌ తెలిపారు. 

గొర్రెలు మంద మనస్తత్వాన్ని ప్రదర్శిస్తాయి. మందతో పాటు కదులుతాయి. వేటాడే జంతువుల నుంచి రక్షించుకునేందుకు అలా వ్యవహరిస్తుంటాయి. వైరల్‌ అయిన వీడియోలో గొర్రెల ఓనర్‌.. మిస్‌ మియావోగా తేలింది. ఆమె దగ్గర 34 గొర్రెల దొడ్లు ఉన్నాయని. కానీ, ఒక్క మందలోనే గొర్రెలే అలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని ఆమె పేర్కొంది. చాలాకాలం వాటిని మందలో ఉంచి.. ఆ తర్వాత వాటిని పొలంలోకి వదిలిందట!. నవంబర్‌ 4వ తేదీ నుంచి అవి అలా వ్యవహరిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పుడవి ఇంకా గుండ్రంగానే తిరుగుతున్నాయా? తిరగడం మానేశాయా? అనే విషయాలపై మాత్రం స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు