Saudi Arabia: భారత్‌ సహా 16 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌, ఎందుకంటే..

23 May, 2022 07:15 IST|Sakshi

రియాద్: భారత్‌ సహా పదహారు దేశాలపై ట్యావెల్‌ బ్యాన్‌ విధించింది సౌదీ అరేబియా. మంకీపాక్స్‌ నేపథ్యంలోనే అని తొలుత కథనాలు వెలువడగా.. కారణం అది కాదని ఖండించింది సౌదీ అధికార యంత్రాంగం. కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ప్రయాణ నిషేధం ఎంతకాలం పాటు అనే విషయంపై ఎలాంటి స్పష్టం ఇవ్వలేదు అక్కడి ప్రభుత్వం.

ఆసియా, ఆఫ్రికా, సౌత్‌ అమెరికా ఖండాల నుంచి మొత్తం పదహారు దేశాల నుంచి ప్రయాణికుల రాకలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. భారత్‌, లెబనాన్‌, సిరియా, టర్కీ, ఇరాన్‌, అఫ్గనిస్థాన్‌, యెమెన్‌, సోమాలియా, కాంగో, లిబియా, అర్మేనియా, బెలారస్‌, వెనిజులా.. ఇలా మొత్తం 16 దేశాలు జాబితాలో ఉన్నట్లు తెలిపింది. 

దేశంలో 414 కొత్త కరోనా కేసులు Corona Cases వెలుగు చూశాయని శనివారం సౌదీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి, ఏప్రిల్‌ వారాంతపు కేసులతో పోలిస్తే.. ఇది ఐదు రెట్లు ఉండడంతో ఆందోళన చెందుతోంది ఆ దేశం. దాదాపు 81 కరోనా మరణాలు నమోదు కావడంతోనే ట్రావెల్‌ బ్యాన్‌ విధిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ లిస్ట్‌లో ఉన్న దేశాల నుంచి కాకుండా.. మిగతా దేశాల ప్రయాణికులపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండబోవని పేర్కొంది. అదే విధంగా ఒకవేళ దేశం నుంచి బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన వాళ్లు మాత్రం.. మూడు డోసుల వ్యాక్సిన్‌ పూర్తి చేసుకుని ఉండాలని స్పష్టం చేసింది. పన్నెండు నుంచి పదహారేళ్ల లోపు వయసు వాళ్లకు రెండు డోసులు ఉంటే చాలని తెలిపింది. ఆరోగ్యపరమైన మినహాయింపులు ఉంటే తప్ప.. ఎవరినీ బయటకు పంపేది లేదని క్లారిటీ ఇచ్చింది.

చదవండి: మంకీపాక్స్‌ విజృంభణ.. 14 దేశాల్లో 100కిపైగా కేసులు

మరిన్ని వార్తలు