కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట

11 Jun, 2023 05:52 IST|Sakshi

తిరిగి భారత్‌కు పంపడం వాయిదా

ఒట్టావా: కెనడాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరట లభించింది. పంజాబ్‌కు చెందిన లవ్‌ ప్రీత్‌ సింగ్‌ సహా 700 మంది భారతీయ విద్యార్థుల్ని తిరిగి మన దేశానికి పంపడాన్ని కెనడా ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు అందేవరకు వారు కెనడాలో ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఫోర్జరీ ఆఫర్‌ లెటర్‌లతో విద్యావకాశాలకు అనుమతి సంపాదించి లవ్‌ ప్రీత్‌ సహా ఇతర విద్యార్థులు కెనడాకి వచ్చారని కెనడియన్‌ బోర్డర్‌ సర్వీసు ఏజెన్సీ (సీబీఎస్‌ఏ) విచారణలో తేలింది.

దీంతో జూన్‌ 13లోగా కెనడా వీడి వెళ్లిపోవాలంటూ లవ్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు 700 మంది వరకు విద్యార్థులకు నోటీసులు అందాయి. ఒక సంస్థ చేసిన మోసానికి గురైన తాము బాధితులమే తప్ప మోసగాళ్లము కాదని తాము ఎందుకు దేశం విడిచి వెళ్లాలంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలకి దిగారు. జలంధర్‌కు చెందిన కన్సల్టెంట్‌ బ్రిజేష్‌ మిశ్రా కెనడాలోని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీల నుంచి తప్పుడు ఆఫర్‌ లెటర్లు సృష్టించి ఆ విద్యార్థుల్ని ఆరేళ్ల క్రితమే కెనడాకు పంపారు.

రాయబార కార్యాలయం కూడా కాలేజీలు ఇచ్చిన లెటర్స్‌ ఫోర్జరీ అని గుర్తించలేకపోయింది. విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లేవరకు అవి ఫేక్‌ అని తెలియలేదు. ఆ తర్వాత వేరే కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మిశ్రా నమ్మబలికాడు. కెనడాలో శాశ్వత నివాసం కోసం ఆ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం జరిపించిన విచారణలో కాలేజీల ఆఫర్‌ లెటర్స్‌ ఫోర్జరీ అన్న విషయం బయటపడింది. దీంతో బ్రిజేష్‌ మిశ్రాకు చెందిన ఎడ్యుకేషన్‌ అండ్‌ మైగ్రేషన్‌ సర్వీసెస్‌ను రద్దు చేశారు. అప్పట్నుంచి ఆ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగానే మారింది.

మరిన్ని వార్తలు