కోవిడ్‌ తర్వాత మారిన ట్రావెల్‌ ట్రెండ్స్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టు వర్కేషన్‌

30 Oct, 2022 17:48 IST|Sakshi

అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రావెల్‌ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్‌ ట్రావెల్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌’ ప్రకారం, 93% మంది భారతీయులు కోవిడ్‌ ముందుతో పోలిస్తే ప్రయాణాలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. భారతీయులు ఈ ఏడాదిని టూర్స్‌కి మంచి సంవత్సరంగా భావిస్తున్నారు. భారతీయులను ప్రయాణానికి ప్రేరేపించేవాటిలో కొత్త అనుభవాలను కనుగొనడం 48శాతం మందికి ముఖ్యమైందిగా నిలిచింది.

పెరిగిన ప్రయాణాలు.. 94 శాతం మంది ఖర్చు

అలాగే 46% మంది విశ్రాంతి కోసం చూస్తున్నారు. టూర్స్‌ను ఇష్టపడుతున్నవారిలో 45% మంది కొత్త గమ్యస్థానాలను అన్వేషించారు. ప్రతీ 10 మందిలో ఐదుగురు తమ కలల గమ్యస్థానానికి ఒంటరిగా ప్రయాణించడానికి కూడా సై అంటున్నారు. రెండు ఆందోళనకర కోవిడ్‌ నేపధ్య సంవత్సరాల తర్వాత, భారతీయ టూర్‌ ఇష్టులలో ప్రయాణ సెంటిమెంట్‌ బాగా పుంజుకుంది.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నుంచి వర్కేషన్‌ దాకా
కోవిడ్‌ దెబ్బకు కార్పొరేట్‌ ఉద్యోగుల పనితీరు  ఆన్‌లైన్‌ వర్క్, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, హైబ్రిడ్‌/రిమోట్‌ వర్కింగ్‌ సిస్టమ్‌.. ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా మారింది.  ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్‌లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్‌ చేస్తూనే అసైన్డ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్‌ ట్రెండ్‌నే వర్కేషన్‌గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్‌ ప్రియుల్ని డిజిటల్‌ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టిసిఎస్, ఇన్ఫోసిస్,అన్‌అకాడమీ తదితర కార్పొరేట్‌ సంస్థలు ’నిరవధిక వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్‌ బాగా ఊపందుకుంది

పనితో పాటే టూర్స్‌...
ట్రావెల్‌ కంపెనీ బుకింగ్‌ డాట్‌ కామ్‌  సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను  బుక్‌ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్‌స్టేషన్‌ల పోస్ట్‌లు బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్‌స్టారీల్స్‌తో సోషల్‌ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది.  గత వారం, ఇండోనేషియా మరింత మంది విదేశీ పర్యాటకులను దేశంలోకి ఆహ్వానించడానికి ’డిజిటల్‌ నోమాడ్స్‌ వీసా’ని అందించింది.

ప్రపంచంలోని ఏ ప్రదేశం నుండి అయినా పని చేయాలని కోరుకునే వారి కోసం మార్చిలో పోర్చుగల్‌ రెండేళ్ల నివాస వీసాను ప్రకటించింది. ఇటలీ కూడా వర్క్‌–ఫ్రమ్‌–ఎనీవేర్‌ బృందాల కోసం తన ప్రయాణ విధానాన్ని పునర్నిర్మిస్తోంది. వారిలో ఎక్కువ మంది హాలిడే మూడ్‌లో  పని చేస్తుండడాన్ని బాగా ఇష్టపడుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు  టూర్స్‌ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్‌ ఆపేరేటర్స్‌ చెప్పారు.


.వర్క్‌తో పాటే విందు, వినోదం
 ‘‘మా రిసార్ట్స్‌లో 80శాతం వరకూ వర్కేషన్‌ కు అనువుగా మార్చాం.  బెస్ట్‌ వైఫై నెట్‌ వర్క్, , ఫుడ్‌ ప్రీ ఆర్డర్స్‌  పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌ ఏర్పాటు చేశాం’’ అంటూ క్లబ్‌ మహీంద్రా రిసార్ట్స్‌ ప్రతినిధి చెప్పారు.  కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్‌ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్‌ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని   రిసార్ట్స్‌లో కయాకింగ్‌ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్‌లైన్‌ మీటింగ్‌కు హాజరయ్యా.  కయాకింగ్‌ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్‌ బ్యాగ్‌ తప్పనిసరిగా ఉంటుంది’’ అంటూ ఐటీ ఉద్యోగి సూర్య చెప్పడం పనితో పిక్నిక్‌ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది.

కేవలం పర్యావరణాన్ని ఆస్వాదించడం మాత్రమే కాకుండా వైవిధ్యమైన అభిరుచులను నెరవేర్చుకోవడానికి టూర్‌ ఇష్టులు తపనపడుతున్నారని క్లబ్‌ మహీంద్రా ప్రతినిధి చెప్పారు. వీటిలో ఇగ్లూలో బస చేయడం, ట్రీ హౌసెస్‌ మీద విందు ఆరగించడం, సమకాలీన కళా ప్రదర్శనలు, హార్స్‌ రైడింగ్, ఎటివి బైక్స్, పెయింట్‌ బాల్, నేచర్‌ వాక్స్‌ వంటివి ఎన్నో ఉన్నాయి.


అభిరుచులు మారాయి...
మా 2.6లక్షల మంది సభ్యుల్లో 30శాతం మంది దక్షిణాది నుంచే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా దిండిలో భాగస్వాములతో కలిసి ఆతిధ్య కేంద్రం నిర్వహిస్తున్నాం. కోవిడ్‌ తర్వాత ట్రావెల్‌ ట్రెండ్స్‌ బాగా మారాయి. అందుకు అనుగుణంగా మా ప్యాకేజీలు కూడా మారుస్తున్నాం.  ఇటీవల బాగా పాప్యులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్‌. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్‌ ప్యాకేజ్‌లను  డిజైన్‌ చేస్తున్నాం. అడ్వంచర్‌ యాక్టివిటీస్, నేచర్‌ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్‌ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్‌ బాల్‌... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం.
–ప్రతినిధి, క్లబ్‌ మహేంద్రా రిసార్ట్స్‌

మరిన్ని వార్తలు