ఇంజనీర్‌తో ఎఫైర్‌: అందుకే బిల్‌ గేట్స్‌ రాజీనామా?!

17 May, 2021 10:20 IST|Sakshi
మాజీ భార్య మెలిందాతో బిల్‌ గేట్స్

వాల్‌స్ట్రీట్‌ కథనంలో కీలక విషయాలు

వాషింగ్టన్‌: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌కు సంబంధించిన మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగితో ఉన్న వివాహేతర సంబంధం వల్లే ఆయన బోర్డు నుంచి వైదొలిగాల్సి వచ్చిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. వివరాలు.. తన జీవితం ఇక పూర్తిగా సామాజిక సేవకే వినియోగించాలనుకుంటున్నానని, అందువల్లే మైక్రోసాఫ్ట్‌ బోర్డుకు రాజీనామా చేస్తున్నట్లు బిల్‌గేట్స్‌ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలతో మరింత బిజీగా మారిపోయారు. 

అయితే, వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజా కథనం ప్రకారం.. ‘‘2000 సంవత్సరంలో బిల్‌గేట్స్‌.. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మహిళా ఇంజనీర్‌తో లైంగిక సంబంధం పెట్టుకోవాలని భావించారు. సదరు మహిళ ఈ విషయం గురించి 2019లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోర్డు..  చట్టబద్ధంగా ఆయనపై విచారణ జరిపించింది. బాధితురాలికి పూర్తి అండగా నిలబడింది’’ అని మైక్రోసాఫ్ట్‌ బోర్డు వెల్లడించింది. అయితే, ఈ ఆరోపణలపై దర్యాప్తు పూర్తికావడానికి ముందే బిల్‌గేట్స్‌ రాజీనామా చేశారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. 

ఇక ఈ విషయంపై స్పందించిన బిల్‌గేట్స్‌ అధికారప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘దాదాపు 20 ఏళ్ల క్రితం నాటి మాట. ఆ బంధానికి స్నేహపూర్వంగానే ముగింపు పలికారు. బోర్డు నుంచి వైదొలగడానికి, దీనికీ ఎటువంటి సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా భార్య మిలిందా గేట్స్‌తో 27 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ బిల్‌ గేట్స్‌ ఇటీవల విడాకుల విషయం వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో..  వీరి బంధం బీటలు వారడానికి యాన్‌ విన్‌బ్లాడ్‌, ఝ షెల్లీ వాంగ్‌ అనే మహిళలు కారణం అయి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయనకు మరో మహిళతోనూ ఎఫైర్‌ ఉందన్న వార్తలు వెలువడటం గమనార్హం. కాగా స్కూల్‌ ఫ్రెండ్‌ పాల్‌ అలెన్‌తో కలిసి 1975లో బిల్‌ గేట్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వచ్చిననాటికి అందులో గేట్స్‌ వాటా 49%.

చదవండి: అత్యంత ఖరీదైన విడాకులు: భార్యలకు ఎంత చెల్లించారంటే!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు