-

ట్రంప్‌ను గద్దెదించేందుకు కేబినెట్‌ చర్చలు!

7 Jan, 2021 11:23 IST|Sakshi

అమెరికా మీడియా కథనాలు

వాషింగ్టన్‌: క్యాపిటల్‌ భవనంపై డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారుచేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరును సొంతపార్టీ నేతలతో పాటు ప్రపంచ దేశాధినేతలు ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా అధికార మార్పిడి జరిగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్‌ జో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించే సమావేశాన్ని అడ్డుకునేందుకు ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాషింగ్టన్‌ డీసీలో తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యవహారశైలి కారణంగానే ఈ దుస్థితి వచ్చిందని, అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించేందుకు కేబినెట్‌ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ట్రంప్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సహా మంత్రిమండలి సిద్ధమైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించి చర్చ జరుగుతోందని, విచక్షణ కోల్పోయి ఆందోళనకు కారణమైన ట్రంప్‌ ఏ క్షణంలోనైనా పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందని రిపబ్లికన్‌ నాయకులు అన్నట్లు సీఎన్‌ఎన్‌ కథనం వెలువరించింది. (చదవండి: ఇది నిరసన కాదు: జో బైడెన్‌)

హింస ఎన్నటికీ గెలవదు
25వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. అధ్యక్షుడు మరణించడం లేదా అభిశంసనకు గురికావడం లేదా రాజీనామా చేయడం, తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించని పక్షంలో ఉపాధ్యక్షుడు ప్రెసిడెంట్‌గా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలన్న ట్రంప్‌ తీరును వ్యతిరేకిస్తున్న వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌.. ‘‘హింస ఎన్నటికీ గెలవదు’’ అంటూ బైడెన్‌ ఎన్నికను ధ్రువపరిచే సమావేశాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ కేబినెట్‌ నిజంగానే ట్రంప్‌ను గద్దెదించేందుకు నిర్ణయిస్తే పెన్స్‌ ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది. (చదవండిఅమెరికాలో హింస.. ట్రంప్‌ తీరుపై ఆగ్రహం)

మరో 14 రోజులు అధికారంలో ఉంటే..
ఇదిలా ఉండగా.. ‘‘మరో 14 రోజుల పాటు ఆయన(ట్రంప్‌) పదవిలో ఉంటే.. ప్రతీ క్షణం అధికార దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తారు. ప్రజలు, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను వెంటనే తొలగించండి’’ అంటూ డెమొక్రాట్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక.. అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ట్రంప్‌ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా జనవరి 20 బైడెన్‌ పదవీ స్వీకార ప్రమాణానికి అధికారులు ఇప్పటికే సర్వం సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు