రిపబ్లికన్లే అడ్డంకి

27 May, 2022 05:53 IST|Sakshi

తుపాకుల నియంత్రణను వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు

పసిపిల్లలు బలైపోతున్నా వ్యక్తి స్వేచ్ఛకే ప్రాధాన్యం

ముక్కుపచ్చలారని పసిమొగ్గలు రక్తమోడుతున్నారు.
చదువులమ్మ చెట్టు నీడలోనే వారికి నూరేళ్లూ నిండిపోతున్నాయి.
పదేళ్ల క్రితం శాండీ హుక్‌ ఎలిమెంటరీ స్కూలు నుంచి
నిన్నటి టెక్సాస్‌ ఘటన వరకు బడిలో తుపాకుల శబ్దం గుండెల్లో దడ పుట్టిస్తోంది.
అగ్రరాజ్యంలో తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఎందుకు రాలేకపోతున్నాయి ?

సాటి మనుషుల ప్రాణాల కంటే మర తుపాకీలే అమెరికన్లకు ఎక్కువా? ఇప్పుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పుల ఘటనలు జరుగుతున్నా, పాఠశాలల్లోకి దుండగులు చొరబడి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను తీస్తున్నప్పటికీ అగ్రరాజ్యం తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలను తీసుకురావడంలో విఫలమవుతోంది. దీనికి ప్రధానంగా సాంస్కృతికపరమైన, రాజకీయప రమైన కారణాలను చెప్పుకోవచ్చు.

మితిమీరిన వ్యక్తి స్వేచ్ఛతో తుపాకీ ఉండడం తమ హక్కు అని 74% మంది అమెరికన్లు భావిస్తారని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదికలో వెల్లడైంది. వ్యక్తిగత భద్రత కోసం తుపాకీ ఉండాలని 26% మంది అమెరికన్లు భావిస్తారు. ప్రైవేట్‌ వ్యక్తులు తుపాకులు కలిగిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికాలో జనాభా కంటే ఆయుధాల సంఖ్యే ఎక్కువగా ఉండడం ఆందోళనకరంగా మారింది. దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 120 తుపాకులు ఉన్నాయి. అంటే సగటున ప్రతి ఒక్కరి దగ్గర తుపాకీ ఉన్నట్టే. 2020 నాటికి అగ్రరాజ్యం జనాభా 33 కోట్లు ఉంటే, ఆ దేశ ప్రజల దగ్గర 40 కోట్ల ఆయుధాలున్నాయి.

రాజకీయంగా భిన్నాభిప్రాయాలు
అమెరికాలో గన్‌ కల్చర్‌ పెరిగిపోవడానికి రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తుపాకీ నియంత్రణ చట్టాలను కఠినతరం చేయాలని ఇప్పుడిప్పుడే సాధారణ ప్రజలు స్వరం పెంచుతున్నప్పటికీ డెమొక్రట్లు, రిపబ్లికన్ల మధ్య విధానపరంగా విభేదాలున్నాయి. 2012 సంవత్సరంలో కనెక్టికట్‌లోని న్యూటౌన్‌లో శాండీ హుక్‌ ఎలిమెంటరీ స్కూలులో తుపాకీ గుళ్లకి 20 మంది చిన్నారులు బలయ్యాక 13 రాష్ట్రాలు తుపాకుల విక్రయంలో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చాయి.

అవన్నీ డెమొక్రట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలే. అదే సమయంలో రిపబ్లికన్ల అధీనంలో ఉన్న 14 రాష్ట్రాల్లో ప్రజలు కూరగాయలు కొన్నంత సులుభంగా తుపాకులు కొనే వెసులుబాటు ఉంది. ప్రజలు తమ ప్రాణ రక్షణ కోసం తుపాకులు తమ వెంట ఉంచుకోవచ్చునని మొదట్నుంచీ రిపబ్లికన్ల వాదనగా ఉంది. అమెరికా రాజ్యాంగంలోని రెండో సవరణ ప్రకారం ‘‘ఆయుధాలు దగ్గర ఉంచుకోవడం ప్రజల హక్కు. రాష్ట్రాల భద్రత కోసం పౌర సైన్యం అత్యంత అవసరం. ఈ నియమాలను ఉల్లంఘించకూడదు’’ అని చెబుతోంది.

తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు ఉండాలన్న డిమాండ్లు వచ్చిన ప్రతీసారి రిపబ్లికన్లు రాజ్యాంగ సవరణని గుర్తుచేస్తూ ప్రజల హక్కులు కాలరాయొద్దని గళమెత్తుతున్నారు. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టాలను నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌(ఎన్‌ఆర్‌ఏ) సమర్థంగా అడ్డుకుంటూ ఉండడంతో విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులోకి వస్తున్నాయి. తుపాకులపై నిషేధం విధిస్తే అమెరికన్లకు రక్షణ ఉండదని, గన్‌ ఫ్రీ స్కూలు జోన్స్‌ వల్ల ఎక్కువ ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఎన్‌ఆర్‌ఏ సీఈవో వేన్‌ లాపీరే అభిప్రాయపడ్డారు. ఎన్‌ఆర్‌ఏ సభ్యుల్లో 77% రిపబ్లికన్లే కావడం గమనార్హం.

మానసిక వ్యాధికి మందు వేయాలని వాదనలు
తుపాకుల నియంత్రణ చట్టాలను విమర్శించేవారు కాల్పులకు పాల్పడినవారంతా ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నవారేనని వాదిస్తున్నారు. కాల్పులకు అడ్డుకట్ట వేయాలంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించేలా తుపాకుల్ని నియంత్రించడం కాకుండా మతి స్థిమితంలేని వారికి చికిత్స చేయాలన్నది రిపబ్లికన్ల వాదనగా ఉంది. తుపాకుల్ని అమ్మే ముందు వారి నేర చరితను చూడాలన్న డిమాండ్లను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు.  

► 2012 డిసెంబర్‌లో శాండీ హుక్‌ ఎలిమెంటరీ స్కూలు విషాదం మొదలు ఇప్పటివరకు 948 సార్లు స్కూళ్లలో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.
► 46 లక్షల మంది పిల్లల ఉండే ఇళ్లలో తుపాకుల్లో బుల్లెట్లు్ల లోడ్‌ చేసే ఉండటం అత్యంత ఆందోళనకరం. ఆ తుపాకులను తల్లిదండ్రులు జాగ్రత్త పరచకపోవడంతో ప్రమాదకరంగా మారాయి.
► పాఠశాలల్లో కాల్పుల ఘటనల్లో వాడిన తుపాకుల్లో 68% ఇంటి నుంచి, స్నేహితులు, బంధువుల నుంచి తీసుకువచ్చినవే.
► స్కూళ్లలో జరిగే తుపాకీ కాల్పుల్లో 93% ముందస్తుగా ప్రణాళిక చేసుకున్నవే.
► శ్వేత జాతీయుల కంటే నల్లజాతి వారే నాలుగు రెట్లు అధికంగా ప్రాణాలు కోల్పోతున్నారు.

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు