అమెరికా హౌస్‌ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఇల్హాన్‌ ఒమర్‌ తొలగింపు

4 Feb, 2023 05:50 IST|Sakshi

వాషింగ్టన్‌: ‘కశ్మీర్‌పై అమెరికా మరింత శ్రద్ధ పెట్టాలి’ అని వ్యాఖ్యానించి భారత్‌ ఆగ్రహానికి గురైన అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలు ఇల్హాన్‌ ఒమర్‌కు షాక్‌ తగిలింది. శక్తిమంతమైన హౌస్‌ విదేశీ వ్యవహారాల కమిటీ నుంచి ఆమెను తొలగించారు. డెమొక్రటిక్‌ సభ్యురాలైన ఒమర్‌ తీరుపై రిపబ్లికన్‌ సభ్యులు చాలా రోజులుగా మండిపడుతున్నారు. ఇజ్రాయెల్, యూదులకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసిన  ఆమె విదేశీ వ్యవహారాల కమిటీలో ఉండడానికి అర్హురాలు కాదని వారు వాదిస్తూ వచ్చారు.

ఓటింగ్‌ నిర్వహించగా కమిటీ నుంచి ఆమె తొలగింపుకు అనుకూలంగా 218 ఓట్లు, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. కమిటీలో లేనంత మాత్రాన తన గళాన్ని ఎవరూ అణచివేయలేరని, తాను మరింతగా రాటుదేలుతానని ఒమర్‌ వ్యాఖ్యానించారు. ఆమె గతంలో పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లో పర్యటించారు. అప్పటి పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తో సమావేశమయ్యారు.

మరిన్ని వార్తలు