Turkey–Syria earthquakes: భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. కానీ ఎవరూ నమ్మలే.. చివరకు..

6 Feb, 2023 21:33 IST|Sakshi

టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించి 2300 మందికిపైగా చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఉపద్రవాన్ని ఓ వ్యక్తి మూడు రోజుల ముందే ఊహించారంటే? నమ్మగలరా? టర్కీ, సిరియాలో త్వరలో భారీ భూకంపం రాబోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అంచనాలు ఎప్పుడూ నిజమైన దాఖలాలు లేవని కొట్టిపారేశారు. 

కానీ మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూకంపం వచ్చి టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. వేల భవనాలు నేలమట్టయ్యాయి. బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి.

భూకంపాన్ని ముందే ఊహించిన ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్‌బీట్స్. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే 'సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే'(SSGEOS) పరిశోధకులు. ఈయన మూడు రోజుల క్రితం చేసిన ట్వీట్ ఇది..
'అతి త్వరలో లేదా తర్వాత సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతో భారీ భూకంపం వస్తుంది.' అని ఫ్రాంక్  ఫిబ్రవరి 3న ట్వీట్‌ చేశారు.

అయితే ఈ ట్వీట్‌ను కొందరు కొట్టపారేశారు. ఫ్రాంక్ నకిలీ శాస్త్రవేత్త అని విమర్శలు కూడా గుప్పించారు. గతంలో ఆయన అంచనాలు ఏనాడూ నిజం కాలేదని చులకన చేసి మాట్లాడారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన అంచనాలే అక్షరసత్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు.

భూకంపం అనంతరం ఫ్రాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిందే నిజమైందని వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ట్వీట్ చేశారు. వందేళ్లకు ఓసారి ఇలాంటి భారీ భూకంపం వస్తుందని, 115, 526 సంవత్సారాల్లో కూడా ఇలాంటి  పెను విపత్తులే సంభవించాయని వివరించారు.

భూకంపం తర్వాత ట్విట్టర్‌లో ఫ్రాంక్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన పేరుతో నకిలీ ఖాతాలు కూడా సృష్టించే పరిస్థితి వచ్చింది. దీంతో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, తన పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు.
చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు..

మరిన్ని వార్తలు