భారత్‌కు మద్దతుగా సెనేట్‌లో తీర్మానం

14 Aug, 2020 09:30 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్న డ్రాగన్‌ తీరుపై సెనేట్‌ ఇండియా కాకస్‌ మండిపడింది. భారత్‌ పట్ల చైనా దుందుడుకు వైఖరిని ఖండిస్తూ సెనెటర్లు జాన్‌ కార్నిన్‌, మార్క్‌ వార్నర్‌ ఈ మేరకు సెనేట్‌లో గురువారం తీర్మానం ప్రవేశపెట్టారు. డ్రాగన్‌ ఆర్మీ భారత పెట్రోలింగ్‌ విభాగ దళాలను వేధింపులకు గురిచేస్తోందని, సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తూ పలు నిర్మాణాలు చేపడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్నిన్‌ మాట్లాడుతూ.. చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నా భారత్‌ సంయమనంతో వ్యవహరిస్తున్న తీరు అభినందనీయమన్నారు. సెనేట్‌ ఇండియా కాకస్‌ సహ వ్యవస్థాపకుడిగా భారత్‌- అమెరికాల మధ్య ఉన్న సత్సంబంధాల గురించి పూర్తి అవగాహన ఉందని, డ్రాగన్‌ దూకుడు వైఖరి నేపథ్యంలో తమ మిత్రుడికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. (అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు)

ఇక జూన్‌ 15న చైనా- భారత్‌ సరిహద్దుల్లో చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారన్న వార్నర్‌... డ్రాగన్‌ రెచ్చగొట్టే చర్యలు వివాదాలకు దారితీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇరు దేశాలు చర్చలతో సమస్యలను పరిష్కరించుకుని ఏప్రిల్‌ 2020కి ముందున్న విధంగా ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారు. కాగా సెనేట్‌ ఇండియా కాకస్‌ గ్రూపును హిల్లరీ క్లింటన్‌, జాన్‌ కార్నిన్‌ 2004లో స్థాపించారు. భారత్‌-అమెరికాల మధ్య దౌత్య, ఆర్థిక, ద్వైపాక్షిక బంధాలు బలోపేతం చేయడం సహా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహిస్తూ పలు సూచనలు, సలహాలు ఇస్తుంది. (ట్రంప్‌ అధ్యక్ష పదవికి తగడు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా