సుడిగాడు: తాగి తన్నుకున్నారు.. బార్‌ నుంచి భారీ పరిహారం రాబట్టాడు

17 Aug, 2021 12:38 IST|Sakshi

నిజంగానే ఇదో క్రేజీ కేసు మరి!. అతనో పచ్చి తాగుబోతు. అలవాటు ప్రకారం ఫుల్‌గా మందేసి.. ఆ మత్తులో బయట మరో తాగుబోతుతో కొట్లాడి గాయపడ్డాడు. మత్తు దిగాక కోర్టులో తనకు మందు పోసిన బార్‌పైనే కేసు వేసి మరీ దాదాపు 40 కోట్ల భారీ నష్టపరిహారం రాబట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

టెక్సాస్‌కు చెందిన డానియల్‌ రాల్స్‌.. 2019 మే నెలలో ఓరోజు ఆండ్రూస్‌లోని లా ఫగోటా మెక్సికన్‌ గ్రిల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ఫుల్‌గా తాగాడు. ఆపై కార్క్‌ పార్కింగ్‌ దగ్గర ఓ వ్యక్తితో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో రాల్స్‌ తలకు గాయం అయ్యింది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక సరాసరి కోర్టులో బార్‌ మీద కేసు వేశాడు డానియల్‌ రాల్స్‌.  ఆ రెస్టారెంట్‌ వల్లే తాను టూమచ్‌గా తాగానని, వాళ్ల నిర్లక్ష్యం వల్లే తన ప్రాణాల మీదకు వచ్చిందని ఆరోపించాడు. 

ఆ బార్‌ పరిసరాల్లో జరిగిందని, వాళ్లు నిర్లక్ష్యంతో తనకు ఫుల్‌గా తాగించారని, ఇలాంటి నేరాలు జరిగే అవకాశ ఉందని తెలిసి మరీ తనకు మందు టూమచ్‌గా సర్వ్‌ చేశారని, పైగా ఘర్షణ టైంలోనూ బార్‌ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదని, గాయపడ్డాక కనీసం ఆంబులెన్స్‌ను కూడా పిలవలేదని.. లాంటి ఆరోపణలు చేశాడు. బార్‌ ఓనర్‌తో పాటు తనకు సర్వ్‌ చేసిన బార్‌టెండర్‌ను నిందితులుగా పేర్కొన్నాడు.

అయితే రాల్స్‌ పచ్చి తాగుబోతు. 2019 ఫిబ్రవరిలో పబ్లిక్‌గా తాగి.. న్యూసెన్స్‌ క్రియేట్‌ చేసి జైలుకు వెళ్లాడు. ఈ ఏడాది మేలోనూ ఓ వ్యక్తితో గొడవ పడి అరెస్ట్‌ అయ్యాడు. ఈ విషయాల్ని బార్‌ ఓనర్‌ తరపు న్యాయవాది వాదనలుగా వినిపించినప్పటికీ.. కోర్టు పట్టించుకోలేదు. ఆ తాగుబోతుకు సపోర్ట్‌గా తీర్పు ఇస్తూ.. 5 మిలియన్ల డాలర్ల నష్టపరిహారం, కోర్టు నోటీసులకు సరిగా స్పందించనందుకు మరో అర మిలియన్‌ డాలర్లను కలిపి రాల్స్‌కు చెల్లించాలని లా ఫగోటా మెక్సికన్‌ గ్రిల్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఆదేశించింది ఆండ్రూస్‌ కౌంటీ 109వ న్యాయస్థానం.

ఇది చదవండి: కంపించిన నేల.. 1300 మరణాలు

మరిన్ని వార్తలు