Desmond Tutu: జాతి వివక్ష పోరాట యోధుడు అస్తమయం

27 Dec, 2021 04:50 IST|Sakshi
గ్రహీత డెస్మండ్‌ టుటు

డెస్మండ్‌ టుటు కన్నుమూత 

జొహన్నెస్‌బర్గ్‌/న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జాతి వివక్షపై అవిశ్రాంత పోరాటం సాగించిన హక్కుల నేత, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్‌ టుటు(90) అస్తమించారు. ఆర్చ్‌బిషప్‌ డెస్మండ్‌ టుటు ఆదివారం వేకువజామున కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా ప్రకటించారు. గతంలో క్షయవ్యాధికి గురైన డెస్మండ్‌ టుటు, ప్రొస్టేట్‌ కేన్సర్‌ బారినపడి 1997లో శస్త్రచికిత్స చేయించుకున్నారు.

అనంతరం పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. బ్రిటిషర్ల హయాంలో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, అన్యాయాలకు గురైన వారి తరఫున డెస్మండ్‌ టుటు తీవ్రంగా పోరాడారు. నల్ల జాతీయుల పాలన మొదలైన తర్వాత కూడా అన్యాయాలను, అక్రమాలను ఖండించడంలో ఆయన వెనుకాడలేదు.

అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతూనే పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను కొల్లగొడుతున్న తీరుపై గళమెత్తారు. ఆర్చ్‌బిషప్‌ టుటు మృతిపై భారత ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆర్చి బిషప్‌ టుటును ‘ఆఫ్రికా పీస్‌ బిషప్‌’గా నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివర్ణించింది. దక్షిణాఫ్రికా నల్లజాతి ప్రజలపై బ్రిటిషర్లు దారుణాలకు పాల్పడినప్పటికీ బిషప్‌ టుటు మాత్రం అహింసాయుత విధానాలకే కట్టుబడి ఉన్నారని కొనియాడింది.

మండేలాతో విడదీయరాని మైత్రి
మొదట జొహన్నెస్‌బర్గ్‌ ఆర్చ్‌బిషప్‌గా ఉన్న టుటు తర్వాత కేప్‌టౌన్‌ బిషప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవులు నిర్వహిస్తూనే స్థానిక నల్లజాతి వారిపై శ్వేత జాతీయుల దురాగతాలను ఖండించడంలో వెనుకాడలేదు. జొహన్నెస్‌బర్గ్‌ ఆర్చ్‌బిషప్‌గా కొనసాగుతున్న సమయంలోనే 1984లో ఆయన్ను నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. బ్రిటిషర్ల హయాంలో జాతి వివక్షకు గురైన వారికి న్యాయం చేసే లక్ష్యంతో 1995లో టుటు నేతృత్వంలో ‘ట్రూత్‌ అండ్‌ రికన్సిలియేషన్‌ కమిషన్‌’ను మండేలా నియమించారు. టుటు, మండేలా మధ్య అనుబంధాన్ని వివరిస్తూ మండేలా ఫౌండేషన్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

‘1950లలో పాఠశాలలో చదువుకునే రోజుల్లో జరిగిన వక్తృత్వ పోటీల సమయంలో మండేలా, టుటు తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరూ జాతి వివక్షపై ప్రజల తరఫున పోరాటం సాగించారు. ఇది నచ్చని బ్రిటిషర్లు వారిద్దరూ కలుసుకోకుండా దాదాపు 4 దశాబ్దాలపాటు పలు అవాంతరాలు కల్పించారు. చివరికి మండేలా 27 ఏళ్లపాటు జైలు జీవితం గడిపి విడుదలయ్యాకే టుటుతో నేరుగా మాట్లాడగలిగారు. చెరసాల నుంచి విడుదలైన మండేలా మొదటగా వెళ్లి ఆ రోజు గడిపింది టుటు నివాసంలోనే’అని తెలిపింది. మండేలా 2013లో తుదిశ్వాస విడిచే వరకు టుటుతో అనునిత్యం మాట్లాడుకుంటూనే ఉన్నారంటూ వారి మధ్య ఉన్న గాఢమైత్రిని గుర్తు చేసింది.

మరిన్ని వార్తలు