‘కనిష్క’ మరోసారి తెరపైకి..

16 Jul, 2022 05:11 IST|Sakshi

1985 నాటి కేసులో నిర్దోషిగా తేలిన రిపుదమన్‌ సింగ్‌ కాల్చివేత

టొరంటో: 1985లో ఎయిరిండియా ‘కనిష్క’ ఉగ్ర బాంబు పేలుడు ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. ఆ కేసులో నిర్దోషిగా బయటపడిన రిపు దమన్‌ సింగ్‌ మాలిక్‌ (75) కెనడాలో గురువారం హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర్నుంచి తుపాకీతో కాల్చేశాడు. దీనిని టార్గెట్‌ కిల్లింగ్‌గా పోలీసులు భావిస్తున్నారు. వాంకోవర్‌లో 16 వేల మంది సభ్యులున్న ఖల్సా క్రెడిట్‌ యూనియన్‌ (కేసీయూ)కు మాలిక్‌ ప్రెసిడెంట్‌. అక్కడే ఖల్సా స్కూళ్లను నడుపుతున్నారు. ఆయనకు పాపిలాన్‌ ఈస్టర్న్‌ ఎక్స్‌పోర్ట్‌ వంటి పలు వ్యాపారాలున్నాయి. మాలిక్‌ హత్యను బాధాకరమైన, దురదృష్టకరమైన ఘటనగా ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ పేర్కొంది.

ఎందరో శత్రువులు
సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ సాహిబ్‌ను భారత్‌ వెలుపల ముద్రించరాదన్న సంప్రదాయాన్ని ఉల్లంఘించి రిపుదమన్‌ వివాదాస్పదుడయ్యారు. ఆయన బయటకు కనిపించినంత మంచి వ్యక్తి కాదని కనిష్క కేసు దర్యాప్తు బృంద సారథి రిటైర్డు డిప్యూటీ కమిషనర్‌ గ్యారీ బాస్‌ చెప్పారు. మాలిక్‌ వివాదాస్పద వ్యక్తి అని ఆయన ఒకప్పటి మిత్రుడు ఉజ్జల్‌ దొసాంజ్‌ అన్నారు. 1985 జూన్‌ 23న 329 మందితో టొరంటో నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా కనిష్కలో సూట్‌కేసు బాంబ్‌ పేలి అంతా దుర్మరణం పాలయ్యారు. ఇది ఖలిస్తానీ ఉగ్రవాదుల పనేననంటారు. ఈ ఘటనలో దోషిగా తేలిన ఇందర్‌జిత్‌ సింగ్‌ రేయాత్‌ అనే వ్యక్తి కెనడాలో 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు.

మరిన్ని వార్తలు