మధ్యతరగతి విస్ఫోటం

13 Nov, 2022 05:30 IST|Sakshi

పెరిగిపోతున్న మధ్యతరగతి జనాభా

2030 కల్లా ప్రపంచంలో 65 శాతం వారే!

డి.శ్రీనివాసరెడ్డి:
మధ్య తరగతి జన విస్ఫోటనం. కొంతకాలంగా ప్రపంచమంతటా శరవేగంగా జరుగుతున్న పరిణామమిది! మార్కెట్ల విస్తరణ, ఆదాయ వనరుల పెరుగుదల తదితర కారణాలతో ఏ దేశంలో చూసినా మధ్య తరగతి జనం ఏటా విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఈ ట్రెండ్‌ మరీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రపంచ జనాభాలో 40 శాతం పైగా వాటా మధ్యతరగతిదే. దాదాపుగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు నడవడానికి వీరి ఆదాయ వ్యయాలే ఇంధనంగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు!  
ప్రఖ్యాత వ్యాపార దిగ్గజాలు కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో మిడిల్‌ క్లాస్‌ను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది!

ఏటా 14 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా మధ్య తరగతి జనాభా ఏటా ఏకంగా 14 కోట్ల చొప్పున పెరిగిపోతోందని, ప్రస్తుతం 320 కోట్లుగా ఉందని ప్రపంచ బ్యాకు తాజా నివేదిక వెల్లడించింది. 2030 నాటికి వీరి సంఖ్య 520 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ప్రపంచ జనాభాలో ఏకంగా 65 శాతానికి చేరనుందన్నమాట! మొత్తం ప్రపంచ ఆదాయంలో మూడో వంతు ఈ మధ్యతరగతి మహాజనుల నుంచే సమకూరుతోందట!

సింహభాగం ఆసియాదే...
ఈ శతాబ్దారంభంలో అమెరికా తదితర సంపన్న యూరప్‌ దేశాల్లో అధిక సంఖ్యాకులు మధ్యతరగతి వారే ఉండేవారు. క్రమంగా అక్కడ వారి వృద్ధి తగ్గుతూ ఆదియా దేశాల్లో శరవేగగంగా పెరుగుతోంది. వరల్డ్‌ డేటా లాబ్‌ అంచనా ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో కొత్తగా రానున్న 100 కోట్ల మంది మధ్యతరగతి జనంలో ఏకంగా 90 శాతం ఆసియాకు చెందినవారే ఉండనున్నారు! భారత్, చైనాతోపాటు ఇండొనేసియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌వంటి ఆసియా దేశాలు మిడిల్‌ క్లాస్‌ జనంతో మరింతగా కళకళలాడతాయట. ఆ దేశాల్లో శరవేగంగా సాగుతున్న పట్టణీకరణే అక్కడ మధ్యతరగతి ప్రాబ ల్యానికి తార్కాణం. వీరు చైనాలో 2010 నాటికి జనాభాలో 49 శాతముండగా ఇప్పటికే 56 శాతానికి పెరిగారు. 2035 నాటికి చైనా జనాభాలో ఏకంగా 100 కోట్ల మంది పట్టణవాసులే ఉంటారని అంచనా. భారత్‌లోనూ 2035 నాటికి 67.5 కోట్ల మంది (45 శాతం) పట్టణాల్లో నివసిస్తారట. ఆసియాలో ఈ సంఖ్య 300 కోట్లుగా ఉండనుంది.

యూఎస్‌లో పాపం మిడిల్‌క్లాస్‌...
ఒకప్పుడు మధ్యతరగతి ఆదాయ వర్గాల దేశంగా నిలిచిన అమెరికాలో వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అక్కడ 35 వేల నుంచి 1.06 లక్షల డాలర్ల వార్షికాదాయముంటే మధ్యతరగతిగా పరిగణిస్తారు. 1971లో దేశ జనాభాలో 61 శాతం మిడిల్‌ క్లాసే కాగా గతేడాదికి 50 శాతానికి తగ్గిందని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. ఇక రష్యా, ఉక్రెయిన్లలో యుద్ధం దెబ్బకు ఒక్క ఈ ఏడాదే ఏకంగా కోటి మంది దాకా మధ్య తరగతి నుంచి దిగువ తరగతికి దిగజారినట్టు ప్యూ నివేదిక వెల్లడించింది.
దేశ, కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలున్నా మొత్తమ్మీద ఒక వ్యక్తి తన అన్ని అవసరాలకు కలిపి రోజుకు దాదాపు రూ.1,000, ఆ పైన వెచ్చించగలిగితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అతన్ని మధ్యతరగతిగా లెక్కిస్తారు. రూ.5 లక్షల నుంచి 30 లక్షల వార్షికాదాయం ఉన్నవారిని మధ్యతరగతిగా పరిగణిస్తారు.

మన దగ్గర కూడా... మధ్యతరగతి మందహాసమే
భారత్‌లో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరు మిడిల్‌ క్లాస్‌ జీవులే. 2047 నాటికి వీరి సంఖ్య రెట్టింపై ప్రతి ముగ్గురిలో ఇద్దరు వాళ్లే ఉంటారని పీపుల్‌ రీసెర్చ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ కన్సూ్యమర్‌ ఎకానమీ (ప్రైజ్‌) అంచనా. 2005లో దేశ జనాభాలో కేవలం 14 శాతమున్న మధ్యతరగతి ఇప్పుడు ఏకంగా 31 శాతానికి పెరిగింది. 2035 కల్లా 43.5 శాతానికి వృద్ధి చెందనుంది!

>
మరిన్ని వార్తలు