Rishi Sunak: ఔను.. వెనుకంజలో ఉన్నా

30 Jul, 2022 01:09 IST|Sakshi

అయినా పట్టు వీడను.. ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తా: రిషి సునక్‌  

లండన్‌: బ్రిటన్‌ తదుపరి ప్రధానమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీలో తాను వెనుకంజలో ఉన్నట్లు కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి రిషి సునాక్‌ అంగీకరించారు. ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ ముందంజలో ఉన్నారన్నారు. అయినా పట్టుదల వీడబోనని, ప్రతి ఓటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే పన్నులు తగ్గిస్తానని ట్రస్‌ హామీ ఇస్తున్నారు. రిషి మాత్రం దేశంలో ఆర్థిక సంక్షోభానికి తెరపడే దాకా పన్నుల తగ్గింపు సాధ్యం కాదని అంటున్నారు.

రిషి, ట్రస్‌ గురువారం రాత్రి యార్క్‌షైర్‌లోని లీడ్స్‌ పట్టణంలో ఒకే వేదికపైకి వచ్చి తమ పార్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి పదవి దక్కితే తాము అమలు చేయబోయే ఆర్థిక విధానాల గురించి వివరించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేశారంటూ ఈ సందర్భంగా రిషిని ఓ సభ్యుడు ప్రశ్నించారు. తద్వారా మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు వెన్నుపోటు పొడిచారంటూ ఆక్షేపించారు.

‘10, డౌనింగ్‌ స్ట్రీట్‌’ (ప్రధాని నివాసం)లో రిషిని చూడాలని జనం కోరుకోవడం లేదన్నారు. ఆర్థిక విధానాలపై బోరిస్‌తో విభేదాలు తీవ్రతరం కావడం వల్ల రాజీనామా చేయక తప్పలేదని రిషి బదులిచ్చారు. అందుకు దారి తీసిన కారణాలను వివరించి ఆకట్టుకున్నారు. కన్జర్వేటివ్‌ పార్టీలోని 1,75,000 మంది సభ్యులు  పార్టీని నేత, తద్వారా తదుపరి ప్రధానిని ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్‌ 5 విజేతను ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు