రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు

29 Jul, 2022 15:01 IST|Sakshi

లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్‌ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం వంటి అంశాలపైనే ఇద్దరు తమ విధానాల గురించి వివరించారు. నార్త్ యార్క్‌షైర్ లీడ్స్‌లో వేదికగా జరిగిన ఈ కర్యక్రమంలో టోరీ సభ్యుల నుంచి రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వారంతా ప్రధాని బోరిస్‌ జాన్సన్ పట్ల తమ విధేయతను చాటుకుంటూ రిషిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించారు. దానికి ఆయన కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.

'మీరు మంచి సేల్స్‌మన్‌, బలమైన వ్యక్తి. కష్ట సమయంలో స్థిరంగా పాలన సాగించిన బోరిస్‌కు అందరూ మద్దతుగా నిలిచారు. కానీ మీరు మాత్రం వెన్నుపోటు పొడిచారని చాలా మంది అనుకుంటున్నారు. మిమ్మల్ని సీనియర్‌ పొలిటీషియన్‌ను చేసింది బోరిసే'  అని ఓ టోరీ సభ్యుడు రిషి సునాక్‌ను ప్రశ్నించారు.

అయితే రిషి ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. గత్యంతరం లేకే తాను ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. కరోనా కష్ట సమయంలో ఆర్థిక విధానాలపై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినందుకే అలా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

అలాగే తాను అధికారంలోకి వస్తే పన్ను రాయితీ ఇస్తానని ప్రకటించిన లిజ్ ట్రస్‌ ఆర్థిక విధానాలపైనా రిషి విమర్శలు గుప్పించారు. తాత్కాలిక ఉపశమనం కోసం పన్నుల్లో కోత విధించి తర్వాతి తరాల పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టలేనని స్పష్టం చేశారు.
చదవండి: లైవ్‌ ప్రోగ్రామ్‌లో కుప్పకూలిన యాంకర్‌.. సాయం చేసిన రిషి సునాక్‌

మరిన్ని వార్తలు