నేను నటించదల్చుకోలేదు.. నెక్స్ట్‌ ఇయర్‌లోనూ యూకే కష్టాలు కొనసాగుతాయి

31 Dec, 2022 16:15 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కొత్త సంవత్సరం సందర్భంగా జాతిని ఉద్దేశించిన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిని యూకేకు కష్టకాలంగా అభివర్ణించిన ఆయన.. సమస్యలు ఇంకా తీరిపోలేదని, వచ్చే ఏడాదిలో అవి కొనసాగుతాయనే పేర్కొన్నారు. 

నేను నటించదల్చుకోలేదు. అందుకే కొత్త ఏడాదిలో మన సమస్యలన్నీ తీరిపోతాయని మిమ్మల్ని మభ్యపెట్టను. కానీ, 2023 ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనకు బ్రిటన్‌కు ఒక అవకాశం ఇస్తుందని చెప్పగలను. ఉక్రెయిన్‌ యుద్ధం.. బ్రిటన్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో.. రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగింది. ఈ యుద్ధం బ్రిటన్‌తో పాటు యావత్‌ ప్రపంచంపై ఆర్థికంగా ప్రభావం చూపెట్టింది. బ్రిటన్‌ సైతం ఆ ప్రతికూలత నుంచి కోలుకోలేకపోయింది. ఇక్కడి పౌరులపై ఆ ప్రభావం పడిందనే అనుకుంటున్నా. 

అందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధపడిందని తెలిపారు.  అయినప్పటికీ.. అవి సహేతుకంగా ఉన్నాయని భావిస్తున్నాని చెప్పారాయన. మూడు నెలల కిందట.. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి విరామం లేకుండా పని చేస్తున్నామని, అందులో భాగంగానే జాతీయ వైద్య సేవలను పునరుద్ధరించే పనులు వేగం పుంజుకుందని రిషి సునాక్‌ తెలిపారు. అలాగే.. అక్రమ వలసలను సైతం అడ్డుకుంటున్నామని, ప్రత్యేకించి నేరగాళ్లపై ప్రత్యేక నజర్‌ పెట్టామని తెలిపారాయన. రాబోయే రోజుల్లోనూ ఉక్రెయిన్‌కు తమ మద్ధతు కొనసాగుతుందని ప్రకటించిన రిషి సునాక్‌.. బ్రిటన్‌ను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు