హిందూ ప్రధానిగా గర్విస్తున్నా

7 Nov, 2022 05:54 IST|Sakshi

 నా ఎన్నిక భిన్నత్వానికి నిదర్శనం

లండన్‌: బ్రిటన్‌ మొట్టమొదటి హిందూ ప్రధాని అయినందుకు గర్వపడుతున్నానని భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ అన్నారు. ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో భావాల్ని పంచుకున్నారు. ప్రధానిగా తాను ఎన్నికవడం బ్రిటన్‌లో భిన్నత్వానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.యూకేకి 42 ఏళ్ల వయసులోనే ప్రధాని అయిన రిషి సునాక్‌ ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయడానికి ముందు గోమాతకి పూజ చేస్తారు. దీపావళి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ‘‘ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపావళి పండుగకి దివ్వెలు వెలిగించాను.

అలా చెయ్యగలగడం మన దేశం ఎంత అద్భుతమైనదో చాటి చెప్పింది. అదే సమయంలో అదో పెద్ద విషయం కాదన్న అంశాన్ని కూడా చెప్పింది.’ అని సునాక్‌ అన్నారు. ప్రధాని ఎన్నిక సమయంలో బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని కావడానికి వీలుగా తాను పోటీ నుంచి తప్పుకుంటానని జరిగిన ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘‘పార్లమెంటులో నా సహచర ఎంపీల నుంచి నాకు గట్టి మద్దతు ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్న సమయంలో ప్రధానిగా నేనే సరైన వ్యక్తినని గట్టిగా నమ్మాను. రేసు నుంచి తప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు’’ అని సునాక్‌ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు