Akshata Murty: మంచి పని చేసినా.. విమర్శలు ఎదుర్కొంటున్న రిషి సునాక్‌ భార్య అక్షతా మూర్తి

9 Jul, 2022 16:02 IST|Sakshi

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్‌కు తదుపరి ప్రధాని రేసులో ‍ప్రముఖంగా మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్‌ పేరు వినిపిస్తోంది. రిషి సునాక్‌ కూడా రంగంలోకి దిగుతున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. దీంతో, ఆయనకు పలువురు ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. తాజాగా రిషి సునాక్‌ భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వార్తల్లో నిలిచారు. కాగా, రిషి సునాక్‌ ప్రధాని రేసులో ఉన్నట్టు ప్రకటించిన తర్వాత ఆయన మీడియాకు కనిపించలేదు. దీంతో జర్నలిస్టులు ఆయన కోసం ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఈ క్రమంలో సునాక్‌ భార్య.. అక్షతా మూర్తి స్వయంగా తానే వచ్చి టీ, స్నాక్‌ అందించారు. దీంతో, ఆమె సోషల్‌ మీడియాలో వార్తలో నిలిచారు.

ఈ ఘటనపై కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు. ఎన్నో కోట్ల‌కు అధిప‌తికి అయిన అక్ష‌తా మూర్తి ఎంతో సంప్లిసిటీతో జర్నలిస్టులకు టీ అందించారని.. ఆమె నిరాడంబ‌ర‌త‌ను ఇది నిదర్శనమంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, ఆమె టీ ఇచ్చిన ఒకో టీ క‌ప్పు ధ‌ర దాదాపు రూ.3,600(38 పౌండ్లు) ఉంటుంద‌ని తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.  ఆమె త‌మ గొప్ప‌త‌నాన్ని చూపించ‌డం కోస‌మే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ఆ టీ క‌ప్పు ఖ‌రీదుతో ఓ కుటుంబం రెండు రోజుల పాటు జీవించవచ్చు అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరోవైపు.. అక్షతా మూర్తి చేసిన పని సునాక్‌ను విమర్శలకు గురిచేసింది. ఇక, అక్షత మూర్తికి ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. కాగా, వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్‌లో నాన్‌-డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని అక్షతా మూర్తి పన్నులు కట్టకుండా ఎగవేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై.. కొద్ది రోజుల క్రితం అక్షతా మూర్తి ప్రతినిధి స్పందిసూ.. తాము చట్టప్రకారం బ్రిటన్‌లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: రోడ్డుపైకొచ్చిన బోరిస్‌ మైనపు విగ్రహం.. ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు