కంపెనీలో కాపలాగా రోబో డాగ్‌..

9 Mar, 2021 11:43 IST|Sakshi

సాధారణంగా చాలా మంది పెంపుడు జంతువులుగా కుక్కలను పెంచుకుంటారు. ఆ మూగజీవాలు మన రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ భవిష్యత్తులో వాటిని కూడా రోబోలతో భర్తీ చేస్తామేమో..! అవును మీరు చదివింది నిజమే.. రానున్న కాలంలో రోబోలే మనకు కాపలాగా ఉండనున్నాయి. కెనడాకు చెందిన ఆల్బార్టా షెల్‌ రిఫైనరీ కంపెనీ ‘స్పాట్‌’ అనే రెండు రోబో డాగ్‌లను కాపలా ఉద్యోగులుగా చేర్చుకున్నారు. ప్లాంట్‌లో అత్యంత ప్రమాదకరమైన పనులను ఈ రోబో డాగ్‌లు చూడనున్నాయి. వీటితో ప్లాంట్‌లో ప్రాణనష్టం తక్కువని భావించి ఈ రోబోలను వారి కంపెనీలో చేర్చుకున్నారు. ఈ రోబో డాగ్‌లను అమెరికాకు చెందిన బోస్టన్‌ డైనమిక్స్‌ అనే సంస్థ రూపొందించింది. స్పాట్‌ రోబో డాగ్‌ ధర సుమారు లక్ష డాలర్లు.

స్పాట్‌ ప్రత్యేకతలివే..
స్పాట్‌ చేసే పని చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ఈ రోబో డాగ్‌లు గంటకు మూడు మైళ్ల గరిష్ట వేగాన్ని అందుకోగలవు. అంతేకాకుండా వీటికి అమర్చిన 360 డిగ్రీల కెమెరాలతో వాటికి ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా తప్పించుకోగలవు. సుమారు పద్నాలుగు కిలోల వరకు బరువును మోయగలవు. స్పాట్‌ను అత్యల్పంగా -20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి, అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వద్ద ఆపరేట్‌ చేయవచ్చు. అంతేకాకుండా ఆయిల్‌, గ్యాస్‌  కంపెనీలో జరిగే లీకేజీలను కూడా ఇవి పసిగట్టగలవు. ఈ రోబో డాగ్‌లను పలు క్లిష్టమైన పనులకు ఉపయోగించవచ్చునని బోస్టన్‌ డైనమిక్స్‌ తెలిపింది. అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌, రేడియేషన్‌ ఎక్కువగా ఉండే న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌, ఆయిల్‌ రిఫైనరీ కంపెనీలో వీటిని వాడొచ్చుననీ పేర్కొంది. బోస్టన్‌ డైనమిక్స్‌ స్పాట్‌ రోబో డాగ్‌లతో పాటు, బిగ్‌ డాగ్‌, హ్యాండిల్, చీతా, పెట్‌మెన్‌, అట్లాస్‌ లాంటి హ్యూమనాయిడ్‌ రోబోలను రూపొందించింది. వీటిలో ప్రస్తుతం స్పాట్‌ రోబో డాగ్‌లను మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు