వరుస రాకెట్‌ దాడులతో వణికిన కాబూల్‌

21 Nov, 2020 16:40 IST|Sakshi

ఎనిమిది మంది మృతి

కాబూల్‌: ఆప్గానిస్తాన్‌ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. శనివారం ఉదయం వరుస రాకెట్‌​ లాంఛర్‌ దాడులతో వణికిపోయింది. వరుసగా 23 రాకెట్‌లు దూసుకొచ్చాయని ఆప్గాన్‌ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్‌ అరియాన్‌  ధృవీకరించారు.  ఈ ఘటనలో దాదాపు ఎనిమిది మంది పౌరులు మృతి చెందినట్లు, 31 మంది గాయపడ్డట్లు తారిఖ్‌ ప్రకటించారు. ఈ దాడికి తాలిబన్లు కారణం అని ఆయన ఆరోపించారు.

కాబూల్‌ లోని సెంట్రల్‌,ఉత్తర ప్రాంతాలలో దాడి జరిగింది. ఈ ప్రదేశం అ‍త్యంత భద్రత కలిగిన గ్రీన్‌ జోన్‌. అక్కడ విదేశీ రాయబార కార్యాలయాలు కొన్ని అంతర్జాతీయ సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. దాడి అనంతరం కూలిన భవనాలు, పగిలిన కిటీకీలతో ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ప్రభుత్వం ఈ దాడి చేసింది తాలిబన్‌లు అని ప్రకటించగా, తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముబాహిద్‌ ఖండించాడు. 

గత కొంతకాలంగా కాబూల్‌లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. కొన్ని వారాల క్రితం రెండు యూనివర్శిటీపై దాడి జరిగింది. అటు తరువాత జరిగిన మరో దాడిలో దాదాపుగా  50 మంది ప్రజలను కాల్చి చంపారు. ప్రతిసారి దాడులు చేసింది తాలిబన్‌లు లేదా వారు పోషిస్తున్నజిహద్‌ శక్తులేనని ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. తాలిబన్‌లు మాత్రం దాడులు చేస్తోందని మా సంస్థలు కాదని, ఇలా చేసే వారు మా పేరును వాడుకుంటున్నారని చెప్తుతున్నారు. మేము ప్రజలపై దాడులు చేయమని అంటున్నాము. ఈ ఏడాది ఫిబ్రవరిలో  ఆప్గాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ జరుగుతుందని,దానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసామని, దానికే కట్టుబడి ఉన్నామని తాలిబన్లు వాదిస్తున్నారు. 

కాగా, ఇటీవల విద్యాసంస్థలపై దాడులు చేసింది భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ అని తనకు తానే ప్రకటించుకుంది.  ఈ రోజు(శనివారం) దాడి చేసింది పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్ర సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ అని తాలిబన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా గత ఆరు నెలల్లోఉ‍గ్రవాదుల చేసిన మారణహోమం తాలుకూ వివరాలను ప్రకటించారు. తాలిబాన్లు 53 ఆత్మాహుతి దాడులు,1,250 పేలుళ్లు జరిపారని అందులో 1,210 మంది పౌరులు మరణించగా, 2,500 మంది గాయపడ్డారని  అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తారిక్ అరియన్ ప్రకటించారు. మరోవైపు శనివారం ఉదయం రెండు చిన్న "స్టిక్కీ బాంబు" పేలుళ్లు సంభవించాయని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.  వీటిలో ఒకటి పోలీసు కారును ఢీకొట్టింది ఈ దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు