ఆఫ్ఘాన్‌ అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి

20 Jul, 2021 15:19 IST|Sakshi
రాకెట్‌ దాడికి ముందు అధ్యక్ష భవనంలో సామూహిక ప్రార్థనలు

కాబూల్‌: బక్రీద్‌ పర్వదినం పురస్కరించుకుని దేశ అధ్యక్షుడు ప్రసంగం చేసే సమయానికి ముందే అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ ఘటన పండుగ వేళ కలకలం రేపింది. ఆఫ్ఘాన్‌ అధ్యక్ష భవనం లక్ష్యంగా మంగళవారం రాకెట్ల దాడి జరిగింది. దేశ రాజధాని కాబూల్‌లో ఉన్న అధ్యక్ష భవనం సమీపంలోకి మూడు రాకెట్లు వచ్చిపడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ చర్యను ఆఫ్ఘాన్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

బక్రీద్‌ సందర్భంగా అధ్యక్ష భవనంలో ఉదయం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు అశ్రఫ్‌ గని ప్రసంగం మొదలుపెట్టాలి. ప్రార్థనలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్ష భవనానికి సమీపంలో రాకెట్ల దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం ఏర్పడింది. అయితే రాకెట్లు భవనం సమీపంలో పడినా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆఫ్ఘాన్‌ మంత్రి మిర్‌వాస్‌ స్టాన్క్‌జాయ్‌ ప్రకటించారు.

ఈ దాడి ఎవరు జరిపారో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఆ దేశంలో తాలిబన్ల దాడులు తీవ్రంగా ఉన్నాయి. పండుగ వేళ కలకలం రేపేలా వారి చర్యలు ఉన్నాయని భావిస్తున్నారు. అమెరికా, నాటో దళాలు పూర్తిగా విరమించుకున్న సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఏకంగా అధ్యక్ష భవనం లక్ష్యంగా దాడి చేయడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఈ దాడిని అధ్యక్షుడు అశ్రఫ్‌ గని తీవ్రంగా ఖండించారు. తాలిబన్ల తీరుపై అశ్రఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు