తుపాకీకి భయపడి బిల్డింగ్‌ పైనుంచి దూకిన చిన్నారులు

11 May, 2021 15:46 IST|Sakshi

మాస్కో: చదువుకునేందుకు పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తుపాకీ గుళ్లకు భయపడి బిల్డింగ్‌ పైనుంచి దూకేశారు. ఓ ఆగంతకురాలి దుశ్చర్యతో అమాయకులైన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణభయంతో ఆమె బారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు చిన్నారులు పాఠశాల భవనం మూడో అంతస్తు పై నుంచి దూకారు. అయితే తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన రష్యాలోని కజాన్‌ పట్టణంలో చోటుచేసుకుంది. 

19 ఏళ్ల యువతి తుపాకీ ధరించి పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడింది. దీంతో చిన్నారులు ఆందోళన చెందుతూ హాహాకారాలు చేశారు. తూటాల నుంచి తప్పించుకునేందుకు చిన్నారులు పాఠశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకారు. ఇద్దరు విద్యార్థులు కిందకు దూకగా.. 9 మంది చిన్నారులు ఆమె కాల్పుల బారిన పడి మృతి చెందారు. కాల్పుల భయంతో పరుగులు పెట్టడంతో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పాఠశాలకు భద్రతా దళాలు, అంబులెన్స్‌లు చేరుకున్నాయి. మృతదేహాలను, గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు కాల్పులకు పాల్పడిందనే విషయం ఇంతవరకు తెలియదు.

చదవండి: భారత్‌పై నిషేధం: నిర్మోహమాటంగా కోర్టు నిరాకరణ
చదవండి: ‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ
 

>
మరిన్ని వార్తలు