నూతన చట్టంతో మీడియా పై ఉక్కుపాదం మోపిన రష్యా

6 Mar, 2022 09:01 IST|Sakshi

డస్సెల్‌డోర్ఫ్‌: ఇప్పటికే బీబీసీ, వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, డూషెవెల్లి, మెడుజా సంస్థలను నిషేధించిన రష్యా, తాజాగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను కూడా నిలిపివేసింది. రష్యాపై తప్పుడు వార్తలు ప్రసారం చేసే సంస్థలపై క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు వీలు కల్పించేలా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఉక్రెయిన్‌ దాడిపై తమ దేశస్థులకు అందే వార్తలను నియంత్రించే క్రమంలో రష్యా విదేశీ మీడియాపై ఉక్కుపాదం మోపుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం నిర్ణయం ఆధారంగానే ఫేస్‌బుక్, ట్విట్టర్‌ను నిషేధించామని రష్యా మీడియా నియంత్రణ సంస్థ రోస్కోమ్నజార్‌ తెలిపింది. మీడియాపై నియంత్రణకు ఉద్దేశించిన బిల్లును రష్యా చట్టసభలు వెనువెంటనే ఆమోదించగా, అధ్యక్షుడు పుతిన్‌ సంతకం చేశారు. దీని ప్రకారం ఉక్రెయిన్‌ యుద్ధంపై తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తే ఇకపై 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.  

తప్పుకుంటున్న సంస్థలు 
మీడియాపై నియంత్రణ పెరగడంతో పలు విదేశీ మీడియా సంస్థలు రష్యాలో కార్యకలాపాలను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నాయి. రష్యాల ప్రసారాలు తాత్కాలికంగా నిలిపివేస్తామని సీఎన్‌ఎన్, బ్లూమ్‌బర్గ్‌ లాంటి సంస్థలు ప్రకటించాయి. బిల్లుకు ఆమోదం లభించడంతో తమ ప్రసారాలు నిలిపివేస్తున్నామని న్యూస్‌ వెబ్‌సైట్‌ జ్నాక్‌ ప్రకటించింది. ఇప్పటికే ఎకో రేడియో స్టేషన్, డోజ్‌ టీవీ చానెల్‌పై రష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై దాడిలో తమకు ఎదురుదెబ్బలు తగిలాయని, ఉక్రెయిన్‌ పౌరులను చంపేస్తున్నామనే వార్తలన్నీ తప్పుడు వార్తలని రష్యా తెలిపింది.

ఉక్రెయిన్‌పై దాడిని రష్యా మీడియా సంస్థలు ‘ప్రత్యేక మిలటరీ యాక్షన్‌’గా పిలుస్తున్నాయి. తమ సైనికులను రక్షించుకునేందుకు, నిజాన్ని కాపాడేందుకే మీడియా నియంత్రణ బిల్లును తెచ్చామని రష్యా చట్టసభ స్పీకర్‌ వోలోడిన్‌ చెప్పారు. ప్రభుత్వ చర్యతో కోట్లాది రష్యన్లకు నమ్మకమైన నిజం తెలియకుండా పోతోందని ఫేస్‌బుక్‌ ప్రతినిధి నిక్‌ క్లెగ్‌ విమర్శించారు. ఈ బిల్లు పాత్రికేయ స్వాతంత్య్రాన్ని హరిస్తుందని బీబీసీ డీజీ టిమ్‌    డేవ్‌ అభిప్రాయపడ్డారు.  

(చదవండి: రష్యా-ఉక్రెయిన్‌ డిజిటల్‌ వార్)

మరిన్ని వార్తలు