పశ్చిమ ఉక్రెయిన్‌పై గురి

12 Mar, 2022 03:35 IST|Sakshi
కీవ్‌ సమీపంలోని ధ్వంసమైన వంతెన మీదుగా వలస పోతున్న ఇర్పిన్‌ వాసులు

విమానాశ్రయాలపై రష్యా దాడులు

రాజధాని కీవ్‌ శివార్ల దాకా

చొచ్చుకొచ్చిన భారీ కాన్వాయ్‌!

25 లక్షలు దాటిన వలసలు

లెవివ్‌/న్యూయార్క్‌/లండన్‌: ఇన్నాళ్లూ ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతాల్లో దాడులు సాగించిన రష్యా సైన్యం ఇప్పుడు తొలిసారిగా నాటో దేశాల సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ ప్రాంతంపై గురిపెట్టింది. శుక్రవారం పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎయిర్‌పోర్టులపై ఉధృతంగా వైమానిక దాడులు చేసింది. పశ్చిమ లట్‌స్క్‌ ఎయిర్‌ఫీల్డ్‌పై జరిగిన దాడిలో ఇద్దరు ఉక్రెయిన్‌ సైనికులు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదన్న సంకేతం ఇవ్వాలన్నదే రష్యా ఉద్దేశమని భావిస్తున్నారు.

దినిప్రో నగరంలో రష్యా దాడుల్లో ఒక పౌరుడు మరణించాడు. ఉక్రెయిన్‌ దక్షిణ, తూర్పు ప్రాంతాలపై రష్యా సైన్యం ఇప్పటికే పట్టు సాధించింది. ఉత్తర ప్రాంతంలో స్థానికుల నుంచి భారీ ప్రతిఘటన ఎదురవుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకొనేందుకు రష్యా వేగంగా ముందడుగు వేస్తోంది. నగర శివార్లలో నిలిచిపోయిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ సైనిక వాహన శ్రేణి ముందుకు కదులుతోంది. కీవ్‌ను చుట్టుముట్టి, పూర్తిగా దిగ్బంధించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌పై అత్యంత కచ్చితత్వంతో కూడిన లాంగ్‌రేంజ్‌ ఆయుధాలు ప్రయోగిస్తోందని రష్యా రక్షణ శాఖ చెప్పింది.

‘స్వచ్ఛంద సైనికులకు’ పుతిన్‌ అంగీకారం
సిరియా నుంచి సైనిక బలగాలను ఉక్రెయిన్‌కు తరలిస్తామని రష్యా సంకేతాలిచ్చింది. రష్యా తరపున స్వచ్ఛందంగా పోరాడుతామంటూ మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి 16,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ చెప్పారు. వారిని సైన్యంలో చేర్చుకొనేందుకు అధ్యక్షుడు పుతిన్‌ అంగీకారం తెలిపారని వెల్లడించారు. రష్యా నుంచి తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు టర్కీకి చెందిన పెగాసస్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్‌ నుంచి వలసలు ఇప్పటికే  25 లక్షలు దాటినట్టు ఐరాస శరణార్థుల విభాగం ప్రకటించింది.

రష్యా ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు!
వాణిజ్యం విషయంలో రష్యాకు ఉన్న ‘మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదా’ను తొలగించాలని అమెరికా, ఈయూ దేశాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇక రష్యాతో వాటి ‘శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాలు’ రద్దవుతాయి. రష్యా పార్లమెంట్‌ దిగువ సభ డ్యూమాలోని 386 మంది సభ్యులపై ఇంగ్లండ్‌ శుక్రవారం ఆంక్షలు విధించింది.

మరిన్ని వార్తలు