రెండు వారాల్లో రష్యా టీకా!

31 Jul, 2020 03:28 IST|Sakshi

ప్రమాణాలను పట్టించుకోవడం లేదంటూ అంతర్జాతీయంగా విమర్శలు

మాస్కో: ప్రపంచంలోనే తొలి కరోనా టీకాను ఆగస్ట్‌ 10 లేదా ఆగస్ట్‌ 12వ తేదీలోగా విడుదల చేసేందుకు రష్యా సిద్ధమవుతోంది. గామాలెయ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన ఈ టీకాకు సాధ్యమైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని రష్యా భావిస్తోందని ఈ మొత్తం ప్రక్రియతో సంబంధమున్న అధికారిని ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్‌’ఒక కథనం ప్రచురించింది. ఆగస్ట్‌ 15లోగా ప్రజల వినియోగానికి అనుమతి లభించవచ్చని అధికార మీడియా ప్రకటించింది.

రష్యాలోనే మరో టీకాకు మానవ ప్రయోగాల దశ ప్రారంభమైందని కూడా వెల్లడించింది. జూలై 27న ఐదుగురు వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారని, వారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని తెలిపింది. మరోవైపు, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ రూపొందిస్తున్న టీకాను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకాతో రష్యాకు చెందిన ఆర్‌ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా పరిశోధనలను దొంగిలించేందుకు రష్యా హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్, కెనడా, అమెరికా ఆరోపిస్తుండగా ఈ ఒప్పందం కుదిరింది.

ప్రమాణాలను పట్టించుకోవడం లేదు
టీకాను విడుదల చేయాలన్న తొందరలో రష్యా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. రష్యా టీకాకు రెండో దశ ట్రయల్స్‌ కూడా పూర్తి కాలేదని, ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా ప్రయోగాలు దీనికన్నా ముందంజలో ఉన్నాయని వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అయితే, తాము అన్ని నిబంధనలు పాటిస్తున్నామని రష్యా అంటోంది.

మరిన్ని వార్తలు