Coal Mine Tragedy: రష్యా బొగ్గు గనిలో ప్రమాదం.. 52 మంది మృతి

26 Nov, 2021 08:41 IST|Sakshi

మాస్కో: రష్యాలోని సైబీరియాలో బొగ్గు గనిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు రక్షకులతో సహా ఇప్పటి వరకు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య సైబీరియాలోని కెమెరొరో ప్రాంతంలోని లిట్స్‌వ్యనయ బొగ్గు గని బయట ఉన్న బొగ్గు పొడిలో ముందుగా మంటలు చెలరేగాయి. వెంటిలేషన్‌ వ్యవస్థ గుండా అగ్నికీలలు గని లోపలికి వేగంగా వ్యాపించి చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో అనేకమంది గనిలో చిక్కుకుపోయారు.
చదవండి: దక్షిణాఫ్రికా ‘దడ’.. కొమ్ములు విరుచుకుంటున్న కొత్త వేరియెంట్‌

ఈ ఘటన జరిగే సమయానికి గని లోపల 285 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గనిలో ప్రాణాలతో బయటపడిన వారు లేరని రష్యా అధికారులు చెబుతున్నారు. మృతదేహాలు భూగర్భంలోనే ఉన్నాయి. ప్రమాదవశాత్తూ గనిలో ఏవైనా పేలుళ్లు జరిగే ఆస్కారముందనే అంచనాతో సహాయక చర్యల్ని తాత్కాలికంగా ఆపేశామని రష్యా అత్యయక వ్యవహారాల తాత్కాలిక మంత్రి అలెగ్జాండర్‌ చెప్పారు. ఘటనపై రష్యా దర్యాప్తునకు ఆదేశించింది.

కాగా రష్యా దేశంలో ఐదేళ్లలో జరిగిన అత్యంత ఘోరమైన గని ప్రమాదం ఇది. మృతుల కుటుంబాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కెమెరోవో ప్రాంతంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు సంతాప దినాలను రష్యా సర్కారు ప్రకటించింది.

మరిన్ని వార్తలు