యుద్ధాన్ని మేం ఆరంభించం! అలాగని.. చూస్తూ ఊరుకోం: రష్యా ప్రకటన

29 Jan, 2022 04:41 IST|Sakshi

ఉక్రెయిన్‌ సంక్షోభంపై రష్యా వ్యాఖ్య

మాస్కో: ఉక్రెయిన్‌లో తొలుత తాము యుద్ధాన్ని ఆరంభించమని రష్యా విదేశాంగమంత్రి సెర్గేవ్‌ లావ్రోవ్‌ శుక్రవారం ప్రకటించారు. అలాగని పాశ్చాత్య దేశాలు రష్యా రక్షణ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించవచ్చని అమెరికా, మిత్రపక్షాలు అనుమానపడుతున్నాయి. ఈ నేపథ్యంలో లావ్రోవ్‌ స్పందించారు. రష్యా యుద్ధాన్ని కోరుకోదన్నారు.

ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌ సరిహద్దులకు లక్ష మంది సైనికులను రష్యా తరలించడం, నాటో పక్షాలు యుద్ధ నౌకలు మొహరించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని రష్యా పలుమార్లు ప్రకటించినా యూఎస్‌ నమ్మడం లేదు. నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడాని రష్యా డిమాండ్‌ చేస్తోంది. కానీ నాటో, యూఎస్‌ ఈ డిమాండ్‌ను తిరస్కరించాయి.

యూఎస్, మిత్రదేశాలు తమ విధానాన్ని మార్చుకోనప్పుడు తాము కూడా తమ విధానాన్ని మార్చుకోమని లావ్రోవ్‌ తెలిపారు. ప్రస్తుతం రాజీకి ఆస్కారం ఉన్నట్లు కనిపించడం లేదని హెచ్చరించారు. తాము సంవత్సరాల క్రితం ప్రతిపాదించిన అంశాలపై చర్చలకు అమెరికా ఇప్పుడు అంగీకారం చెబుతోందని ఆయన విమర్శించారు. నాటో విస్తరణను ఆపాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని, దీనిపై మరోమారు ఆయా దేశాలకు లేఖ రాస్తామని చెప్పారు.  

కొనసాగిన హెచ్చరికలు
రష్యా దురాకమ్రణకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అమెరికా, మిత్రపక్షాలు చేస్తున్న హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయన్‌ను ఆక్రమిస్తే రష్యా నుంచి నిర్మించిన పైప్‌లైన్‌ నుంచి సహజవాయువు సరఫరాను జర్మనీ అడ్డుకుంటుందని యూఎస్‌ అధికారులు గురువారం ప్రకటించారు. ఆంక్షల బెదిరింపులపై లావ్రోవ్‌ స్పందిస్తూ అమెరికా జోక్యంతో అన్ని రకాల బంధాలకు ఆటంకం కలుగుతుందని విమర్శించారు.

ప్రస్తుతం బాల్టిక్‌ సముద్ర చుట్టుపక్కల ప్రాంతాల్లో అటు రష్యా, ఇటు నాటో బలగాల సంరంభం పెరిగింది. సైనికుల, యుద్ధవిమానాల విన్యాసాలు ఎక్కువయ్యాయి. సంక్షోభ నేపథ్యంలో అంతా శాంతి వహించాలని ఉక్రెయిన్‌ నేతలు అభ్యర్ధిస్తున్నారు. రష్యా ఆక్రమణకు దిగుతుందని భావించడంలేదన్నారు. అయితే యూఎస్‌ అధ్యక్షుడు బైడెన్‌ మాత్రం రష్యాపై అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు