ఐదు లక్షల మంది రష్యాలో అక్రమ బందీలుగా! తల్లీబిడ్డలను విడగొడుతున్నారంటూ..

14 Apr, 2022 18:13 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌ యుద్ధంలో తూర్పు ప్రాంతాలపై పట్టుకోసం రష్యా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో భారీగా బలగాలను తరలిస్తోంది కూడా. అయితే తమ గడ్డపై, వర్ణించలేని రీతిలో అకృత్యాలకు తెగబడుతోందంటూ ఆరోపిస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగాడు.

సుమారు ఐదు లక్షల మంది ఉక్రెయిన్‌ పౌరులను బలవంతంగా రష్యా తమ ఆధీనంలోకి తీసుకుందని ఆరోపించాడు జెలెన్‌స్కీ. వీళ్లందరినీ రష్యా ఫెడరేషన్‌ పరిధిలో ఉండే రహస్య స్థావరాల్లో దాచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. బుధవారం రాత్రి.. ఎస్టోనియన్‌(ఎస్టోనియ) పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్‌స్కీ, యుద్ధ భయంతో వీడుతున్న ఉక్రెయిన్‌ పౌరులను.. వాళ్ల వాళ్ల డాక్యుమెంట్లను, వస్తువులను, ఫోన్లను స్వాధీనం చేసుకుని మరీ తరలించుకుని పోతోందని రష్యా బలగాలపై ఆరోపణలకు దిగాడు.

అంతేకాదు ఉక్రెయిన్‌ పిల్లలను రష్యాలోని కుటుంబాలు అక్రమంగా దత్తత తీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయని, తల్లీబిడ్డలను బలవంతంగా వేరు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశౠడు. ఈ విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ జోక్యం చేసుకోవాలని కోరాడు జెలెన్‌స్కీ. ఇక ఇదే ప్రసంగంలో.. రష్యా పాస్పరస్‌ బాంబులు ప్రయోగిస్తోందని, ఉక్రెయిన్‌ పౌరులను భయంతో సైన్యం లొంగదీసుకుంటోందని ఆరోపించాడు. అయితే కఠిన ఆంక్షల ద్వారా రష్యాను శాంతి చర్చలకు తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డాడు జెలెన్‌స్కీ.

చదవండి: రష్యాది ముమ్మాటికీ నరమేధమే!

>
మరిన్ని వార్తలు