‘‘ఆ వ్యాక్సిన్‌ గురించి అసత్యాలు ప్రచారం చేయమన్నారు’’

26 May, 2021 15:06 IST|Sakshi

పైజర్‌ వ్యాక్సిన్‌పై అసత్యాలు ప్రచారం చేసేలా సోషల్‌ మీడియా సంస్థలకు ఎర

రష్యాతో లింక్‌ ఉన్న పీఆర్‌ ఏజెన్సీ దుర్మర్గాపు చర్య

వాషింగ్టన్‌: ప్రపంచం కరోనాతో పోరాడుతుంది.. జనాలు వ్యాక్సిన్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పలు దేశాలు టీకాల కొరతతో ఇబ్బంది పడుతుండగా.. కొన్న ఫార్మ కంపెనీలు మాత్రం వ్యాక్సిన్‌ల గురించి అసత్యాలు ప్రచారం చేసే పనిలో ఉన్నాయి. ఈక్రమంలో రష్యాతో సంబంధం ఉన్న ఓ పీఆర్‌ ఏజెన్సీ పైజర్‌ బయో ఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ గురించి అసత్యాలు ప్రచారం చేయాల్సిందిగా యూరోప్‌కు చెందిన పలు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, బ్లాగర్స్‌ను కాంటాక్ట్‌ అయినట్లు తెలిసింది.

రష్యాతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఈ పీఆర్‌ ఏజెన్సీ ఫైజర్‌ వ్యాక్సిన్‌ గురించి ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు పోస్ట్‌ చేయాల్సిందిగా పలువురు బ్లాగర్స్‌ని కోరినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ ‘‘ఆస్ట్రాజెనికాతో పోల్చితే.. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో మరణాలు 3 రెట్లు అధికంగా ఉన్నట్లు ప్రచారం చేయాల్సిందిగా ఓ పీఆర్‌ ఏజెన్సీ నన్ను కోరింది. అంతేకాక పైజర్‌ వ్యాక్సిన్‌ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలని ప్రశ్నించాల్సిందిగా మమ్మల్ని అభ్యర్థించింది’’ అని తెలిపాడు. 

పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్‌ పైజర్‌ గురించి పుకార్లు వ్యాప్తి చేయాల్సిందిగా ఏజెన్సీ తమను సంప్రదించాయని వెల్లడించడమే కాక ఇందుకు సంబంధించిన రుజువులను కూడా తమ సోషల్‌మీడియా అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్‌ కలిగిన ప్రసిద్ధ పోడ్కాస్ట్ హోస్ట్ అయిన మిర్కో డ్రోట్ష్మాన్ తనకు వచ్చిన ఇమెయిల్ స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇన్‌ఫర్మేషన్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఫైజర్ వ్యాక్సిన్ వల్ల అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తాయని ప్రచారం చేయాల్సిందిగా తనను కోరారని మిర్కో డ్రోట్ష్మాన్‌ ట్వీట్‌ చేశాడు. అంతేకాక పోడ్కాస్ట్‌ సబ్‌స్క్రైబర్స్‌లో ఎక్కువ మంది ఏ వయసు వారు ఉన్నారు..ఈ పని చేయడానికి ఎంత డబ్బు తీసుకుంటారో తెలపాల్సిందిగా కోరినట్లు మిర్కో తెలిపాడు. 

సదరు పీఆర్‌ ఏజెన్సీ రష్యాకు చెందిన ఫాజ్ అని.. దీన్ని ఒక రష్యన్ పారిశ్రామికవేత్త చేత స్థాపించాడని స్థానిక మీడియా తెలిపింది. ఈ వార్తలు వెలువడిన వెంటనే సదరు జెన్సీ తన వెబ్‌సైట్‌ను నిలిపివేయడమే కాకా దాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌గా చేసింది. ఏజెన్సీ లండన్‌లో ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ, ఇందుకు సంబంధించి రిజిస్టర్డ్ చిరునామా గుర్తించలేదని మీడియా తెలిపింది. 

చదవండి: పిల్లలకు ఫైజర్‌ వ్యాక్సిన్‌.. అమెరికా కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు