మృగాడి నుంచి కాపాడినందుకు 15 ఏళ్లు శిక్ష

19 Dec, 2020 14:03 IST|Sakshi
చిన్నారులను కాపాడిన రియల్‌ హీరో వ్లాదిమర్‌ సంకిన్‌

మృగాడి నుంచి బాలురను కాపాడిన మెకానిక్‌

మృగాడి మృతి.. మెకానిక్‌కి జైలు శిక్ష

రియల్‌ హీరోకి మద్దతుగా జనాలు

మాస్కో: ఓ కారు మెకానిక్‌ కోసం ఉఫా ప్రజలు ఏకమయ్యారు. అతడికి విధించిన శిక్ష అన్యాయమైనది అని.. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు 70 వేల మంది సంతకాలు చేసిన లెటర్‌ని ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం కారు మెకానిక్‌ వ్లాదిమిర్ సంకిన్‌ అక్కడి ప్రజల దృష్టిలో హీరోగా నిలిచాడు. ఇంతకు జనాలు ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారు.. అసలు కోర్టు అతడికి ఎందుకు శిక్ష వేసిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. రష్యా ఉఫా నగరంలో నివసిస్తున్న వ్లాదిమర్‌ సంకిన్‌ కారు మెకానిక్‌గా పని చేస్తూ, భార్య, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు. ఆనందంగా సాగిపోతున్న అతడి జీవితాన్ని ఓ సంఘటన మలుపు తిప్పింది. ఉన్నట్టుండి అతడు హంతకుడిగా మారాడు. అది కూడా ఒకరికి సాయం చేయబోతూ.

ఏం జరిగింది..
ఓ రోజు వ్లాదిమర్‌ సంకిన్‌ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ పదిహేనేళ్ల కుర్రాడు సాయం చేయాల్సిందిగా కేకలు వేయడం సంకిన్‌కు వినిపించింది. దాంతో వెంటనే కేకలు వచ్చిన అపార్ట్‌మెంట్‌లోకి దూసుకెళ్లాడు. అక్కడ దృశ్యం చూసి అతడి ర​క్తం మరిగిపోయింది. ఓ పశువు ఇద్దరు మైనర్‌ కుర్రాళ్లపై అత్యాచారానికి  ప్రయత్నిస్తున్నాడు. బాలురిద్దరికి ఒంటి మీద బట్టలు లేవు. నిందితుడు వారి చేత బలవంతంగా మద్యం తాగించినట్లున్నాడు. దాంతో పిల్లలు ఎటు పారిపోలేని స్థితిలో ఉన్నారు. ఈ దృశ్యాలు చూడగానే సంకిన్‌ ఆలస్యం చేయకుండా నిందుతుడిని చితకబాదాడు. ముఖం, తల మీద బలంగా దాడి చేశాడు. సంకిన్‌ దెబ్బలకు తాళలేక నిందితుడు కింద పడిపోయాడు. ఇక పిల్లల్నిద్దర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిన సంకిన్‌ అంబులెన్స్‌కి కాల్‌ చేశాడు. దురదృష్టం కొద్ది ఆస‍్పత్రికి తీసుకెళ్తుండగా నిందితుడు మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సంకిన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అతడికి 15 సంవత్సరాల శిక్ష విధిస్తూ.. కోర్టు తీర్పు చెప్పింది. (చదవండి: అమానుషం.. పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది)

సంకిన్‌కు మద్దతుగా..
అయితే కోర్టు తీర్పును జనాలు వ్యతిరేకిస్తున్నారు. ఓ మృగాడి బారి నుంచి పిల్లల్ని కాపాడాడు. అలాంటి వ్యక్తికి శిక్ష విధించడం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితుడు వ్లాదిమిర్ జైట్సేవ్ ఒక పెడోఫిలె (చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడేవాడు). గతంలో ఇదే నేరం కింద పోలీసులు రెండు సార్లు అతడిని అరెస్ట్‌ చేశారు. జైలు జీవితం కూడా అనుభవించాడు. కానీ అతడిలో మార్పు రాలేదు. మరో సారి ఇలాంటి దారుణానికి పాల్పడుతుండగా.. సంకిన్‌ అతడి నుంచి చిన్నారులను రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నిందితుడు జైట్సేవ్ మరణించాడు. దాంతో జనాలు సంకిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అతడు రియల్‌ హీరో పిల్లలను కాపాడి న్యాయం చేశాడు. కానీ కోర్టు అతడికి శిక్ష విధించి అన్యాయం చేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మాల్‌లో ప్రముఖ నటికి లైంగిక వేధింపులు)

ఇక దీనిపై సంకిన్‌ స్పందిస్తూ.. ‘ఆ కుర్రాడు సాయం కోరినప్పుడు నా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నా దారిన నేను వెళ్లడం.. రెండు వారిని కాపడటం. నేను రెండోదాన్ని ఎంచుకున్నాను. నా స్థానంలో ఎవరు ఉన్నా అలానే చేస్తారు’ అని తెలిపాడు. ఇక వ్లాదిమర్‌ తరపు న్యాయవాది అతడి శిక్షను రద్దు చేయాలని లేదా తగ్గించాలని కోరుతున్నాడు. 

మరిన్ని వార్తలు