స్పుత్నిక్‌-వీ.. రష్యా కీలక నిర్ణయం

2 Dec, 2020 20:42 IST|Sakshi

వచ్చే వారం నుంచి సామూహిక టీకా కార్యక్రమం

మాస్కో: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ రేసులో ఉన్నాయి. త్వరగా టీకాని తీసుకువచ్చి.. సురక్షితమని నిరూపించి.. ఇతర దేశాలకు అమ్మాలని భావిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించడంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సదేహం లేదు. అందుకే పలు దేశాలు తమ వ్యాక్సిన్‌ ఎంత సురక్షితమో.. ఎప్పటి వరకు అందుబాటులోకి రానుందనే విషయాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అభివృద్ధి చేస్తోన్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి స్పుత్నిక్‌-వీ మాస్‌ వ్యాక్సినేషన్‌ని(సామూహిక టీకా కార్యక్రమం) ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక ఇప్పటికే యూకే ఫైజర్-బయోఎంటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించిన మొదటి దేశంగా నిలిచిన సంగతి తెలిసిందే. యూకే నిర్ణయం వెల్లడించిన గంటల వ్యవధిలోనే రష్యా ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్ 95 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని రష్యా గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: 90%సామర్థ్యం ఉండాల్సిందే!)

అంతార్జీతయ మార్కెట్లో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్ ఒక్క డోసుకు 10 అమెరికన్‌ డాలర్ల కన్నా (రూ. 740) తక్కువ ఖర్చు అవుతుంది. కరోనా నుంచి రక్షణ పొందటానికి ప్రతి వ్యక్తికి స్పుత్నిక్‌-వీ రెండు డోసులు సరిపోతాయని రష్యా వెల్లడించింది. అంటే కరోనా వ్యాక్సిన్‌ కోసం ఒక్కొక్కరు 20 డాలర్లు అంటే 1580 రూపాయల కన్నా తక్కువే ఖర్చు చేయాల్సి వస్తోంది. స్పుత్నిక్‌-వీ కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి అంతర్జాతీయ డెలివరీ జనవరిలో జరుగుతుంది. రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా తయారు చేయారవుతుందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) తెలిపింది. (చదవండి: దేశానికంతా టీకా అక్కర్లేదు)

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఆర్డీఐఎఫ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ నుంచి అవసరమైన క్లియరెన్స్ పొందిన తరువాత భారతదేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వీ ఫేజ్‌ 2/3/ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు