మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌

3 Dec, 2022 15:20 IST|Sakshi

మాస్కో: ప్రపంచంలోని శక్తిమంతమైన నేతల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి జారి పడిపోయారని అంతర్జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. 70 ఏళ్ల పుతిన్‌ మెట్లపై నుంచి పడిపోవడంతో స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన బాడీగార్డ్స్‌ సోఫాలో కూర్చోబెట్టగా వైద్యులు చికిత్స అందించినట్లు సమాచారం. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అనారోగ్య సమస్యలతో సమతమతవుతున్నట్లు వెల్లడిస్తూ వస్తున్న జనరల్‌ ఎస్‌వీఆర్‌.. తాజా పరిణామాన్ని రష్యన్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌కు తెలిపినట్లు మీడియా పేర్కొంది. అయితే, ఈ విషయంపై క్రెమ్లిన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. మెట్లపై నుంచి పడిపోవడం వల్ల తుంటి ఎముక దెబ్బతినంటతో పాటు జీర్ణాశయాంతర క్యాన్సర్‌ బయటపడిందని మీడియా పేర్కొంది. ‘సమీపంలోని సోఫాలోకి తీసుకెళ్లేందుకు ముగ్గురు సెక్యూరిటీ అధికారులు పుతిన్‌కు సాయం చేశారు. అధికారిక నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను పిలిపించారు. పుతిన్‌ ఇప్పటికే జీర్ణాశయాంతర పేగు ఆంకాలజీతో బాధపడుతున్నారు. దాని ఫలితంగా ఆయన ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ కారణంగానే మెట్లపై నుంచి పడిపోయారు.’ అని స్థానిక మీడియా పేర్కొంది. 

పుతిన్‌ మెట్లపై నుంచి పడిపోయిన క్రమంలో ఆయన ఆరోగ్యంపై మరోమారు వార్తలు గుప్పుమన్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి, దగ్గు, మైకము, నిద్రలేమి, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారని పలు మీడియాలు కథనాలు వెల్లడించాయి. పుతిన్‌ తన చుట్టూ క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లు నిత్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారని గతంలోనూ పలు మీడియాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: చైనాలో ‘జీరో కోవిడ్‌’ ఆంక్షలు ఎత్తివేస్తే 20 లక్షల మరణాలు?

మరిన్ని వార్తలు