Vladimir Putin Speech: అంచనాలను తలకిందులు చేస్తూ.. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ రక్షణ కోసమే పోరాటం: పుతిన్‌

9 May, 2022 14:31 IST|Sakshi

అంచనాలను తలకిందులు చేస్తూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ‘విక్టరీ డే’ సందర్భంగా సాదాసీదా ప్రకటన చేశారు. సోమవారం మాస్క్‌ రెడ్‌ స్క్వేర్‌ దగ్గర వేలాది మంది సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారాయన.  ఉక్రెయిన్‌ గడ్డ మీది ‘మాతృభూమి’ రక్షణ కోసమే రష్యా బలగాలు పోరాడుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన.

నాజీయిజానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ గడ్డపై పోరు కొనసాగుతుందని స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ప్రపంచ యుద్ధంతో మరోసారి భయానక పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఆమోదయోగ్యం కాని ముప్పుతో రష్యా పోరాడుతోందని చెప్పిన పుతిన్‌.. అంతా ఊహించినట్లు యుద్ధంపై కీలక ప్రకటనేమీ చేయలేదు. అంతకు ముందు.. విక్టరీ డే వేదికగా పుతిన్‌.. యుద్ధాన్ని తీవ్రతరం చేయబోతున్నట్లు లేదంటే యుద్ధవిరమణ ప్రకటన చేయొచ్చంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. 

అయితే పుతిన్‌ మాత్రం ఉక్రెయిన్‌పై మిలిటరీ చర్యకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మాతృభూమి కోసం మీరంతా పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ని రష్యా రక్షించుకునే యత్నం చేస్తోంది. దేశ భవిష్యత్తు కోసమే ఇదంతా. కాబట్టి, రెండో ప్రపంచ యుద్ధం నేర్పిన పాఠాలను ఎవరూ మర్చిపోవద్దూ’’ అంటూ ప్రసంగించారాయన. 

ఈ సంక్షోభానికి.. ఉక్రెయిన్‌, పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించిన పుతిన్‌.. కీవ్‌, దాని మ్రితపక్షాలు రష్యాకు చెందిన చారిత్రక ప్రాంతాలను(రష్యన్‌ భాష మాట్లాడే డోనాబస్‌ రీజియన్‌, క్రిమియా ప్రాంతాన్ని..) ఆక్రమించే యత్నం చేశాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాకు మరో ఛాయిస్‌ లేదు. రష్యా సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకున్న సరైన నిర్ణయం అని మిలిటరీ చర్యను సమర్థించారాయన. 

ఇక నాజీ జర్మనీని ఓడించిన ఘట్టానికి సోమవారం నాటికి 77 ఏళ్లు వసంతాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా రెడ్‌ స్క్వేర్‌ వద్ద పదకొండు వేల మంది సైన్యం, 130 మిలిటరీ వాహనాలతో భారీ ఎత్తున్న ప్రదర్శనలు నిర్వహించారు. 

చదవండి: తల్చుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం!!

మరిన్ని వార్తలు