రష్యా అధ్యక్షుడి చూపు మందగించిందా?.. కొన్నివారాలు బయటకు రాకుండానే..

11 Apr, 2023 18:59 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై రకరకాల వదంతులు వినవస్తున్నాయి. వాటిని ధృవీకరిస్తూ కొన్ని వీడియోలు, ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే.. క్రెమ్లిన్‌ వర్గాలు మాత్రం ఎప్పటికప్పుడు ఆ వందతుల్ని కొట్టిపారేస్తూ వస్తున్నాయి.

తాజాగా బ్రిటిష్‌ టాబ్లాయిడ్‌ ‘మెట్రో’ ఓ సంచలన కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడని, ఆయన చూపు కూడా మందగించిందని, నాలుక తిమ్మిరి సమస్యతోనూ ఇబ్బంది పడుతున్నారని సదరు కథనం పేర్కొంది. అంతేకాదు.. పుతిన్‌కు కుడివైపు  భాగం సైతం స్వల్పంగా స్పర్శ కోల్పోయిందని పేర్కొంది.

రోజు రోజుకీ ఆయన ఆరోగ్యం దిగజారుతోందన్న తాజా వరుస కథనాల నడుమ.. ఈ కథనం వెలువడడం గమనార్హం. పైగా రష్యన్‌ అవుట్‌లెట్‌ ద్వారానే తాము ఆ సమాచారం సేకరించినట్లు మెట్రో ప్రచురించింది. ఈ పరిణామాలతో ఆయన వ్యక్తిగత వైద్యుల బృందం.. కొన్నిరోజులు అబ్జర్వేషన్‌లో ఉండమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కొన్నివారాల పాటు ఆయన మీడియా కంట పడరంటూ తెలుస్తోంది.  మరోవైపు ఫిబ్రవరిలోనూ ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఓ వైరల్‌ విపరీతంగా చక్కర్లు కొట్టింది.

మరిన్ని వార్తలు