Russia Ukraine War: హామీకి రష్యా తూట్లు.. పుతిన్‌ స్పందన కరువు!

4 May, 2022 07:30 IST|Sakshi

కీవ్‌: కాల్పుల విరమణ హామీకి తూట్లు పొడుస్తూ మారియుపోల్‌లోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంటుపై రష్యా సైన్యం మంగళవారం మళ్లీ కాల్పులకు, దాడులకు దిగిందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. ప్లాంటును స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసిందని చెప్పింది. 

ప్లాంటును ఆక్రమించొద్దని సైన్యాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌,  రెండు వారాల క్రితం ఆదేశించడం తెలిసిందే. ప్లాంటులో చిక్కుబడ్డ పౌరులు సురక్షితంగా వెళ్లనిచ్చేందుకు ఐరాస విజ్ఞప్తి మేరకు రష్యా రెండు రోజుల క్రితం అంగీకరించింది. అందులో భాగంగా సోమవారం 100 మందికి పైగా పౌరులు ప్లాంటు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మరో 200 మంది దాకా మహిళలు, పిల్లలు ప్లాంటులో ఉన్నట్టు సమాచారం. 

ఇక యుద్ధం మొదలైన నాటినుంచి 10 లక్షలకు పైగా ఉక్రేనియన్లను రష్యాకు తరలించినట్టు ఆ దేశ రక్షణ శాఖ అంగీకరించింది. వీరిలో 2 లక్షలకు పైగా చిన్నారులే ఉన్నారని చెప్పింది. ఇదిలా ఉండగా శాంతి చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వైఖరిపై పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాస్కో వచ్చి చర్చలు జరుపుతానని నెలన్నర కింద కోరితే..  పుతిన్‌ ఇప్పటికీ స్పందించలేదని పోప్‌ ఫ్రాన్సిస్‌ చెప్పారు.

మరింత సాయం: ఇంగ్లండ్‌ 
ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం చేస్తామని ఇంగ్లండ్‌ ప్రకటించింది. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఉక్రెయిన్‌ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడారు. మరో 30 కోట్ల పౌండ్ల మేరకు సైనిక సాయం అందిస్తామని చెప్పారు. ఉక్రెయిన్‌ పోరాట పటిమ అద్భుతమని కొనియాడారు. ‘‘ఈ పోరులో ఉక్రెయిన్‌ గెలిచి తీరాలి. అందుకోసం ఏం చేయడానికైనా ఇంగ్లండ్‌ సిద్ధం. కీవ్‌ ఆక్రమణ యత్నాన్ని తిప్పికొట్టడం ద్వారా ఉక్రెయిన్‌ ఇప్పటికే 21వ శతాబ్దంలో అత్యంత గొప్ప సాయుధ విజయాన్ని నమోదు చేసింది’’ అని ప్రశంసించారు. ఉక్రెయిన్‌కు 13 ప్రత్యేక బులెట్‌ ప్రూఫ్‌ టొయోటా లాండ్‌ క్రూజర్లు పంపనున్నట్టు ఇంగ్లండ్‌ చెప్పింది.

చదవండి: రష్యా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

మరిన్ని వార్తలు