Putin-Poland: అన్నంత పని చేసిన పుతిన్‌.. గ్యాస్‌ నిలిపివేత

27 Apr, 2022 14:14 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నంత పని చేశారు. సహజ వాయువు కావాలంటే రష్యన్‌ కరెన్సీ రూబుల్స్‌లోనే చెల్లింపులు చేయాలంటూ ఆయన మిత్రపక్షాలు కానీ దేశాలను డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ హెచ్చరికలను ఇప్పుడు నిజం చేశారాయన. 

ఈ తరుణంలో.. రూబుల్స్‌లో చెల్లింపులకు నిరాకరించిన పోల్యాండ్‌, బల్గేరియాలకు గాజ్‌ప్రోమ్‌ నుంచి గ్యాస్‌ సరఫరాను నిలిపివేయించారు. రష్యా ఎనర్జీ దిగ్గజం గాజ్‌ప్రోమ్‌ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పోల్యాండ్‌(పీజీఎన్‌ఐజీ), బల్గేరియా(బల్గర్‌గ్యాజ్‌)లకు  పూర్తిగా గ్యాస్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. రూబుల్స్‌ రూపేణా బకాయిల చెల్లింపుల మూలంగానే ఈ పని చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.   

కిందటి నెలలోనే పుతిన్‌ ఈ హెచ్చరికలు జారీ చేసినప్పుడు చాలా దేశాలు తేలికగా తీసుకున్నాయి. పైగా యూరోప్‌ దేశాలు తమకు రూబుల్స్‌ ఎలాగ ఉంటుందో కూడా తెలియదంటూ సెటైర్లు వేశాయి. ఈ తరుణంలో పుతిన్‌ తొలిసారి గ్యాస్‌ సరఫరా నిలిపివేయించడం ఇదే ప్రథమం. 

ఇక హంగేరీ మాత్రమే రూబుల్స్‌లో చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో.. పుతిన్‌ ప్రతీకారంగా ఈ ప్రకటన చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా దేశాలకు ఇదే పరిస్థితి గనుక ఎదురైతే.. నష్టం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఇది రష్యా ఆర్థికంపైనా ప్రభావం చూపెట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని!

మరిన్ని వార్తలు